(ఆంధ్రప్రభ, రాయచోటి) : అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. నిత్యం నేరాలు, ఘోరాల చర్చలతో జుట్టు పీక్కునే పోలీసు యంత్రాంగం బుధవారం సాంప్రదాయ పద్ధతిలో వినాయకుడికి ఘనంగా ప్రత్యేక పూజలు, నిర్వహించారు.
విఘ్నాలను తొలగించి విజయ మార్గంలో నడిపించే విఘ్నేశ్వరుని అన్నమయ్య జిల్లా పోలీసు కుటుంబం భక్తి శ్రద్ధలతో పూజించింది. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ఈ పూజల్లో పాల్గొన్నారు. మామిడి తోరణాలు, పూలమాలలతో వినాయక మండపాన్ని అలంకరించగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గణపతికి పుష్పార్చనలు, నైవేద్యాలు సమర్పించారు.
పూజ అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ… వినాయకుడు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నింపాలని, సమాజం నుంచి విఘ్నాలు తొలగాలని ప్రార్థించానన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పూజా కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తి గీతాలు పాడి, హారతులు ఇచ్చి, ప్రసాదాన్ని స్వీకరించారు. సమిష్టిగా జరుపుకున్న ఈ పండుగ, పోలీసు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని బలపరిచింది. కార్యక్రమం చివర్లో పోలీసులు గణపతికి మంగళహారతులు ఇచ్చి, సమస్త ప్రజల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.