Sunday Magazine 16 Nov 2025 | ఆదివారం సంచిక 16 నవంబర్ 2025

Sunday Magazine 16 Nov 2025 | ఆదివారం సంచిక 16 నవంబర్ 2025

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
–అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

Sunday Magazine సంచికలో…

1.పురుషులందు…
2.మనసు-మాట శీర్షిక
3.చెల్లుబాటు
4.సన్నిహితం… శీర్షిక
5.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
6.వినరో భాగ్యము – శీర్షిక

Sunday

ప్రతి ఒక్క అంశానికీ ప్రపంచంలో ఎక్కడోచోట… ఏదో మూల ఆ దినోత్సవం ఉండే ఉంటుంది. అవన్నీ మనకు తెలియకపోయినా, అందులో ముఖ్యమైనవి మాత్రం తప్పనిసరిగా జరుపుకుంటాం. వాటి ఉద్దేశం, ఆ అంశాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం… ఆ కోవలోవే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలూ, మాతృదినోత్సవాలూ… మాతృభాషా దినోత్సవాలూ… నవంబరు 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.

పురుషుల దినోత్సవంలో ముఖ్యంగా ప్రస్తావించుకునే అంశాలు, వాటి ప్రాధాన్యతలు చూస్తే, పురుషుల ఆరోగ్యం, సమాజంలో పురుషుల పాత్ర, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై చర్చకు తెరతీయడమే. ఈ ఏడాది థీమ్ పురుషుల మానసిక ఆరోగ్యం–మౌనాన్ని వీడడం.

ఆడ-మగ తేడాల విషయానికి వస్తే మహిళల పట్ల మాత్రమే వివక్ష ఉందనుకోవడం పొరపాటు. అలాగే మగవారు కరకు రాతి మనస్తత్వంతో ఉంటారు..శారీరక-మానసిక దృఢత్వం వారికి మాత్రమే సొంతం అనేది కూడా అన్ని సమయాలలో కరెక్ట్ కాదు. భావోద్వేగాల విషయంలో-సున్నితత్వం విషయంలో కొందరు మహిళలకేమాత్రం తీసిపోరు.

ప్రేమ వైఫల్యాలు, చదువులో వెనకబడిపోవడాలు, ఆర్థిక ఒత్తిడులలో కృంగిపోయి అర్థంతరంగా తనువులు చాలిస్తున్నవారెందరో. వేధింపులు, గృహహింస కూడా ఎదుర్కొనే మగవారు లేకపోలేదు. తరతరాల కట్టుబాట్లు మహిళలకు మాత్రమే కాదు, మగవారికీ ఉన్నాయి. వాటి చట్రంలో నలిగి, చెప్పలేక, చెప్పొకొన్న వినేవారు, అర్థం చేసుకునే వారు లేక నలిగి పోయిన, పోతున్నవారెందరో. వాటిలో కొన్ని మగవారు ఏడిస్తే బాగోదు…

బాధలు చెబితే బేలగా చెప్తున్నాడనుకోవడం. అలాగే ఆమాత్రం బాధ్యతలు మోయలేడా? ఒత్తిడి భరించలేడా? ఇకనైనా ఈ ఆలోచనా విధానం మారాలి. బాధ-ధు:ఖం వ్యక్తపరచడానికి ఆడ-మగ అనే తేడా లేదు. ఉండకూడదు. వ్యక్తపరచడం కన్నా దాచుకుంటేనే వాటి ప్రభావం గుండెపై పడే ప్రమాదముంది.
స్త్రీ-పురుష సమానత్వం అనేదాంట్లో రెండర్థాలున్నాయి. అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది.


Sunday Magazine 16 Nov 2025 | 2.మనసు-మాట శీర్షిక

Sunday

పాఠకులు అందరికి నమస్సులు! ఈ వారం లహరి మనసు-మాట తెలుసుకుందాము రండి

లహరి మనసు మాట: నేను 24 ఏళ్ళ యువతిని. నాకు సిద్ధార్థతో పెళ్లయి 2 సంవత్సరాలు కావస్తుంది. మాకు పెళ్ళైనప్పటి నుంచీ మనస్పర్థలు వస్తూనే ఉన్నాయి . నేను ఇంట్లో అన్నీ బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను. నాది చాలా వత్తిడితో కూడుకున్న బ్యాంకు ఉద్యోగం. అన్ని బాధ్యతలు చేసుకొని ఇంటికి వచ్చాక మళ్లీ అన్ని పనులు చేసే ఓపిక అస్సలు ఉండదు.

పెళ్ళికి ముందు ఐతే అమ్మకి చెప్పగలిగేదాన్ని కానీ ఇప్పుడు ఆలా చెపితే మా అత్తగారు -మావగారు ఏమైనా అనుకుంటారేమో అన్న మొహమాటంతో అన్ని చేసుకుంటూ పోతున్నాను. ఎప్పుడైనా నాకు కష్టం అవుతుంది ఎవరినైనా వంటకి సహాయం పెట్టుకుందాం అంటే ఎందుకు అమ్మ ఉందిగా నీకు సహాయానికి.. అని భర్త, ఇంట్లో ఆడవాళ్లు వండిపెడితేనే ఆ ఇంటికి మంచిది అని.. మా అత్తగారు చెప్తుంటారు.

చేసుకునేది మాత్రమూ నేనే. నాకు కష్టమవుతుంది అని అందరికి అర్థమవట్లేదా, నన్ను ఎందుకు ఎవరూ గమనించట్లేదు, గమనిస్తే నేను వత్తిడిలో ఉన్నాను అని అర్థమవుతుంది కదా అన్నది నా ఆలోచన. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అన్న దుఃఖం ఎక్కువయ్యి ఈ మధ్య అందరి మీద చాల తొందరగా కోపం వస్తుంది. అరుస్తున్నా కూడా అందరి మీద.

అందరికి నేను అరిచాను అని గుర్తుంటుంది కానీ నాకు వచ్చిన కష్టం ఎవరూ పట్టించుకోవట్లేదు. నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను స్వార్థం ఎక్కువ అని అంటున్నారు.. లేదా కోపం ఎక్కువ అని అంటున్నారు. నా భర్త ఈ గొడవలైనప్పుడు ఇష్టం లేకపోతె వెళ్ళిపో లేదా విడిపో అన్నపుడల్లా ఇంకేం చేయాలి ఈ వివాహం నిల్పుకోవటానికి అని వంద రకాలుగా ఆలోచిస్తున్న. దీని వలన అతిగా ఆలోచిస్తావు లేదా అతిగా రియాక్ట్ అవుతావు అని నిందిస్తున్నారు. ఈ వత్తిడి వలన ఎంతో టాలెంట్ వున్నా… గత రెండు సంవత్సరాలనించి నేను వృత్తిలో కూడా ఎదగలేదు.

సైకాలజిస్ట్ మాట:
లహరికి సూచనలు: లహరి మీకు ఆర్థిక స్వతంత్రం (financial independence) ఉంది కానీ ఆర్థిక సాధికారిత (financial empowerment) గురించి నేర్చుకోవాల్సిన అవసరం వుంది. మీరు సంపాదించుకుంటోంది ఎక్కడ ఖర్చుపెట్టాలి అని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలగాలి. రెండు సంవత్సరాలుగా వత్తిడికి లోనవుతున్నారు.. దీని ప్రభావం మీ శారీరిక, మానసిక ఆరోగ్యం మీద పడ్తుంది.

మీరు సంపాదించుకున్నది మీ ఆరోగ్యం కోసం వాడుకోండి. ఇంట్లో కొంత సహాయం ఉంటే మీరు వృత్తి పరంగా ఇంకా ఎదగగల్గుతారు అని కుటుంబ సభ్యులకు చెప్పండి. మీరు కచ్చితంగా ‘నో ‘ చెప్పలేకపోతున్నారు లహరి. దీనినే లూస్ బౌండరీస్ (loose boundaries) అని అంటారు. మీ ఆనందానికి భంగం కలిగించే సందర్భాల్లో ‘నో’ చెప్పడం చిన్న చిన్నగా మొదలుపెట్టండి. మీరు ఆనందంగా ఉంటేనే బంధం ఆనందదాయకం అవుతుంది.

లహరి మీ మనసు-మాట మీ భర్త కి ఈ విధంగా చెప్పి చూడండి :
1.నేను మిమ్మల్ని చూసుకుంటున్నట్టే నన్ను కూడా మీరు చూసుకుంటారా? మీకు నచ్చినట్టు చూడడం కాదు నాకు నచ్చినట్టుగా చూడడం?
2.ఒక్కోసారి నా కోసం నేను బతకాలి అన్నప్పుడు మీకు నచ్చినట్టు నేను వుండలేకపోవచ్చు అలాంటి సమయాల్లో కూడా నాతో సహకరిస్తారా?
3.వివాహ బంధం వలన నాలో కలిగిన భయాలను నిర్భయంగా చెప్పుకోనిస్తారా?
4.విడిపోదాం/వెళ్ళిపో అని కాకుండా నాకు మీ ప్రవర్తన వలన కలిగే బాధ చెప్పనిస్తారా? చెప్పాక దానిని స్వీకరించి మార్పుకి ప్రయత్నిస్తారా?
5.వివాహం అన్నది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగేది, ముందు మన ఇద్దరి బంధం బలపడితేనే దాని మీద ఆధారపడిన ఏ బంధం అన్న బలపడ్తుంది అన్నది పరిగనం లోకి తీసుకుంటారా?

సిద్దార్థకి సూచనలు: వివాహ బంధంలో భార్య/భర్త పరస్పరం ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకున్నప్పుడే బంధం బలపడుతుంది. పార్టనర్ కష్టం గురించి వాళ్ళని చెప్పుకొనే స్వేచ్ఛ ఇవ్వాలి. మీ దృక్పథం ప్రకారంగా వాళ్ళకి నచ్చజెప్పడం కాకుండా వాళ్ళ దృక్పధం వినాలి.. అలాగే వారికి ఏమి కావాలో అది ఇవ్వగలగినప్పుడు మనస్పర్థలు సర్ధుకుంటాయి.

అత్త-మావగారికి సూచనలు : కోడలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంటి అలవాట్లను అలవర్చుకోవడం ఎంత అవసరమో, తన భావాలను అర్థం చేసుకొవడం కూడా అంతే అవసరము అని అర్థం చేసుకుంటే మీ బంధం బలపడ్తుంది… అలాగే లహరి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుంది.

మైండ్ వాయిస్: లహరి ఈ మాట మీ మనసులో పదే-పదే చెప్పుకోండి: అందరికి అన్నీ సమకూర్చాలి అనే తపనలో “సూపర్ వుమన్ ” అవ్వడానికి ప్రయత్నించి మీ మానసిక ఆరోగ్యం కోల్పోకు.


Sunday Magazine 16 Nov 2025 | 3.చెల్లుబాటు

“గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది” అంటూ ఎనిమిదేళ్ల సుజ్జిని తీసుకుని పరుగు పరుగున ఒక చెట్టు కిందకి వెళ్ళి నిలుచున్నాడు సారథి.
“బాబూ డబ్బులు! మాయమ్మ తెమ్మన్నది.” అంటూ ఒక పదేళ్ల కుర్రాడు, వర్షం వలన తల తడవకుండా చెయ్యడ్డం పెట్టుకుని, సారథి దగ్గరకు హడావుడిగా వచ్చాడు.

సారథి తలూపి, పాకెట్ లో నుండి పర్స్ తీయబోతూ ఉలిక్కిపడి, “అరె! వేరే షర్ట్ వేసుకొచ్చాను. పర్స్ ఇంట్లో ఉండి పోయింది” అనుకున్నాడు. పాంట్ జేబు తడిమి, కొన్ని నాణాలు తీసి చూసుకున్నాడు. బిల్లుకు సరిపడా ఉన్నాయి. “హమ్మయ్య!” అనుకుంటూ, అవి ఆ కుర్రాడి చేతిలో పోశాడు. వెళ్లిన కుర్రాడు, గోడకు కొట్టిన బంతి లా తిరిగొచ్చాడు.

“మాయమ్మ ఇయ్యి తీసుకోవద్దంది,” అని ఆ కాయిన్స్ సారధి చేతిలో పోశాడు. పాపను అక్కడే ఉండమని, దోశలు పోస్తున్న దేవమ్మ దగ్గరికి వెళ్ళి, “ఏమ్మా! డబ్బు తీసుకోను అన్నావట?” అన్నాడు సారధి. దేవమ్మ మొహం మాడ్చుకుంటూ, “ఈ పదినానాలు వద్దు సార్. ఎవరూ తీసుకోరు” అంది. “అదేం లేదమ్మా! అదంతా వట్టి అపోహ మాత్రమే. ఇవి చక్కగా చెల్లుబాటు అవుతాయి. తీసుకోవచ్చు” అన్నాడు సారథి.

“వద్దు బాబూ. పర్సు లేకపోతే దాంట్లో కట్టండి” అంటూ ఫోన్ పే స్కాన్ చేసే అట్ట చూపించింది. “పర్సు తేలేదని చెప్పా కదమ్మా. ఫోన్ కూడా అందులోనే ఉంది” అన్నాడు సారధి అసహనంగా. దేవమ్మ హడావుడిగా లేచి, లోనికి వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవరు తెచ్చి, దాని మూతి విప్పి చూపింది. అన్నీ పది రూపాయల నాణాలు. ఒక యాభై నాణాల వరకు ఉన్నాయి.

“ఏమి సేసుకోను బాబూ ఇవి? ఇట్టాగే పెట్టుకుని ఉన్నాను. ఆ మధ్య మా ఇంటాయనకు జబ్బు సేస్తే ఆస్పత్రి పోను, ఆటో ఎక్కేము. ఆ యన్న తీసుకోలేదు. మందులంగడి లో కూడా తీసుకోము పొమ్మన్నారు. లోపల నుండి, ఆమె భర్త కాబోలు, వచ్చాడు. విషయం తెలుసుకుని, “నోట్లు ఇవ్వండి బాబూ” అన్నాడు సారధితో. సారధికి ఏమి పాలుపోక, సుజ్జిని పిలిచి, దోశల పాకెట్, దేవమ్మకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.

“కాస్త నడుస్తూ ఉండండి. తినగానే పడుకోకండి” అంటూ పేషంట్ కి మందులు రాస్తున్న సారధి, బయట ఏదో గొడవ వినబడటంతో, తన రూమ్ నుండి బయటకు వచ్చాడు. దేవమ్మ, ఆమె భర్త. తమ పదేళ్ల కొడుకు తో! ఆ కుర్రాడికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి. “అంత డబ్బు లేదు. గవనిమెంటు ఆసుపత్రికి వెళ్ళే సమయం లేదు” దేవమ్మ ఏడుస్తూ అంటోంది రిసెప్షన్ లో సారధిని చూసి దేవమ్మ ఒక్కసారి ఆశ్చర్యపోయి, భోరున ఏడుస్తూ గబుక్కున కాళ్ళ మీద పడబోయింది.

సారధి, ఆమెని వారించి, సిస్టర్ తో ఆ అబ్బాయిని తీసుకుని రమ్మని, పరీక్ష చేసి, అడ్మిట్ చేయమని చెప్పాడు. రిసెప్షన్ లో అమ్మాయిని పిలిచి ఏదో చెప్పాడు. తను సరేనంటూ తలాడించి దేవమ్మతో, “మీ దగ్గర, పది రూపాయల నాణాలు ఉన్నాయట. సార్ అవి తీసుకుంటా అన్నారు. తీసుకు రండి. నామినల్ గా ఒక నూట యాభై రూపాయలు కట్టండి. మిగతా అంతా, సార్ చూసుకుంటారు.” అంది. రౌండ్స్ కి వెళ్ళడానికి, తన రూమ్ నుండి బయటకు వచ్చిన సారధి వైపు, కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తూ, “ ఈ నానాలు చెల్లుతాయి అనుకోలేదు సామీ! నన్ను చమించండి” అంటూ నమస్కరించింది దేవమ్మ.


Sunday Magazine 16 Nov 2025 | 4.సన్నిహితం… శీర్షిక

మంచికి పోతే చెడు అవడం అనేది జరుగుతుంది ఒక్కోసారి..

ఒకరోజు సాయంత్రం గుడికి వెళ్దామని బైక్ బయటకు తీసి బయలుదేర్తున్నాడు సూర్య. ఇంతలో ఎదురింట్లో అద్దెకు ఉంటున్న అమ్మాయి అతని దగ్గరకు వచ్చి ” నేను కూడా మీతో గుడికి వస్తాను ” అని అడిగింది.వయసులో ఉన్న అమ్మాయి కదా అని తటపటాయించాడు సూర్య. ” నువ్వు తర్వాత వెళ్లొచ్చు కదా ” అన్నాడు ఆ అమ్మాయితో. ” లేదండీ ..అంతదూరం నేను నడవలేను ” అని చెప్పింది ఆ అమ్మాయి.

” సరే ..రండి ” అని చెప్పి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. గుడికి చేరుకునేటప్పటికీ చీకట్లు ముసురుకున్నాయి. దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాడు సూర్య. ఆ అమ్మాయి కూడా దర్శనం పూర్తిచేసి ఆలయ ప్రాంగణంలోనే కూర్చుంది. కాసేపటి తర్వాత ఆ అమ్మాయితో ” నేను ఇంటికి వెళ్తున్నా..మీరు కూడా వస్తారా ? ” అని అడిగాడు మర్యాదకోసం.

” నేను రాను..మా అన్నయ్య వస్తున్నాడు ” అంది ఆ అమ్మాయి. ” సరే…నేను వెళ్తాను అయితే ” అని కదిలాడు సూర్య. ఆ అమ్మాయి ” నేను వయసులో ఉన్న అమ్మాయిని కదా మీతో ఎందుకు వస్తాను మాటి మాటికి ” అంది.షాక్ అయ్యాడు సూర్య. ” ఓహో..నువ్వు అమ్మాయివా ?? మరి ఇందాక ఎందుకు వచ్చావు ? ” అన్నాడు ” అప్పుడు నా అవసరం కాబట్టి వచ్చాను. ఇప్పుడు అవసరం లేదు. అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా ” అని అంటోంది. బుద్ధి వచ్చింది సూర్యకు. ” నీకు లిఫ్ట్ ఇవ్వడం..నీ గురించి ఆలోచించడం నాదే తప్పు ” అనుకుంటూ అక్కడి నుండి వచ్చేశాడు .


Sunday Magazine 16 Nov 2025 | 5.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది

ఈ సామెతలో అద్భుతమైన ‘వ్యక్తిత్వ వికాస పాఠం’ఉంది. ‘నోరు-ఊరు’చక్కగా ప్రాసలో ఒదిగాయి.‘జిహ్వాగ్రే తిష్ఠన్తి కష్టాణి’అని ఆర్య సూక్తి. అంటే మన కష్టాలకు మూలం మన నాలుక కొస లోనే ఉంటుందట. దురుసుగా మాట్లాడేవారు ఎదుటివారి మనస్సులు గెలుచుకోలేరు. మన ‘వాక్కు’నెమ్మదయితే మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు.

ధర్మరాజు, మహాభారతంలో, దీనికి చక్కని ఉదాహరణ. మాట అంత మృదువు. అందుకే ‘అజాత శత్రువు’అన్న బిరుదు ఆయనకు ఒక్కనికే ఉంది. ఇతరులను ‘హర్ట్’చేసేలా మన మాట తీరు ఉండకూడదు. ‘సహనం’వ్యక్తిత్యానికి ఆభరణం. దాన్ని అసమర్థత ఆని ఎవరనుకోంటారో, వారు అవివేకులు. మహాభారతంలోని ఈ పద్యం చూడండి.

కం.:

ఒరులేయవి యొనరించిన

నరవర! యప్రియము దన మనంబున కగు, దా

నొరులకు నవి సేయకునికి

పరాయణము పరమధర్మ పథముల కెల్లన్.

(ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో, ఆ పని ఇతరుల విషయంలో మనం చేయకూడదు. అదే పరమ ధర్మము).

దీనినే, ఈ సామెత సింపుల్‌గా చెప్పింది.

“The honorable part of talk is to give the occasion and again to moderate”

– Of Discourse, – Francis Bacon.

“మన మాటల్లోని అత్యంత గౌరవప్రదమైన భాగం, సందర్భ శుద్ధి. ఏకపక్షంగా ఉండకపోవడం” అంటున్నారు ‘సంభాషణ’అన్న వ్యాసంలో ప్రాన్సిస్ బేకన్ గారు. డొనాల్ట్ ట్రంప్ గారి లాగా ప్రతిదానికి నోరు పారేసుకుంటే, జనం ఛీ కొడతారు. మన మోదీ గారిలాగా స్థితప్రజ్ఞుడిలా ఉండాలి. అప్పుడే ప్రపంచ ప్రియుడవుతాడు ఆయనలాగా! ‘ఆయనంత’కాకపోయినా, కనీసం మన ఊర్లో మనం మర్యాద కాపాడుకోవాలి కదా!

మొదటిసారి ఆంజనేయస్వామివారు, శ్రీరామచంద్ర ప్రభువును, లక్ష్మణ స్వామివారిని కలుసుకుంటాడు. సుగ్రీవ మహారాజు పంపున. ఆయన మాట తీరును రామచంద్రుడు శ్లాఘిస్తాడు. మన మాట ఎలా ఉండాలో ఈయనను చూచి నేర్చుకోవాలని తమ్మునితో చెబుతాడు. ఉషశ్రీ గారు తమ ప్రసంగాలలో తరచు దీనిని ఉటంకించేవారు. శ్రీరాముడిలా అంటాడు.

“నాయనా! లక్ష్మణా! చూశావా! ఈయన ఎవరో, మహా పండితుని వలే ఉన్నాడు. భావదారిద్ర్యం ఇతని మాటల్లో లేదు. అలా అని ఒక్క అదనపు మాట లేదు. ఏ మాట, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో ఈయనకు తెలిసినట్లుగా, ఎవరికీ తెలియదు.”

అతిభాషిత్వం (eloquence), మితభాషిత్యం (Reticence) రెండూ శృతి మించకూడదు. మన మాట balanced గా ఉండాలి. పునరుక్తి దోషాలు ఉండకూడదు. మధ్యలో అకారణంగా ఆగిపోకూడదు. అట్లా, వినడం కూడ ఒక కళేనన్నారు. ‘Patient hearing’కూడ మనల్ని ఊరికి మంచివాడిని చేస్తుంది.

కాలు జారితే, పడిపోతాము. కాని మళ్ళీ లేచి నిలబడగలం. కాని, నోరు జారితే, మాట వెనక్కి తీసుకోలేము. ‘Slip of the tongue’ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారి తీస్తుంది. తర్వాత “నేనలా అనలేదు, నా మాటలను వక్రీకరించారు” అని దబాయించినా ప్రయోజనం ఉండదు. అసలు, ఇంగ్లీషులో ‘టంగ్’అంటేనే ‘భాష’అని అర్థం.

‘ఆత్మవత్ సర్వభూతాని’అన్న మహాన్నత యోగాన్ని అనుసరించే వారి నోరు మాత్రమే మంచిదవుతుంది. అప్పుడు ఊరు మంచిది కాక ఏమవుతుంది? ఊరే కాదు, ఈ ప్రపంచమే మంచిదవుతుంది!

వచ్చే వారం మరో సామెతతో కలుద్దాం.


Sunday Magazine 16 Nov 2025 | 6.వినరో భాగ్యము – శీర్షిక

తిరుమలక్షేత్ర శాసనాల చరిత్ర

తిరుమలక్షేత్ర పరిపాలనాభారాన్ని 1843లో ఆంగ్లేయుల నుంచి మహంతుల అధీనమైంది. 90 ఏళ్లపాటు కొనసాగిన మహంతుల పాలనలో మహంతు ప్రయాగదాస్ 1920 లో వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాల పరిరక్షణ మొదలైంది. 1922-1933 మధ్య కాలంలో ప్రముఖ చారిత్రక పరిశోధకులు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయా ప్రాంతాల్లో లభించిన శాసనాలను పరిష్క రించారు. ఆ పరిష్కరించిన అంశాలన్నీ 8 సంపుటాల్లో, సారాంశ వివరణలను 1 సంపుటంలో ముద్రించడం జరిగింది. ఆ వివరాల ప్రకారం తిరుమల క్షేత్రంలో 640 శాసనాలు, తిరుపతి గోవిందరాజాలయంలో 540 శాసనాలు, ఇతర ఆలయాల్లో 150 శాసనాలు లభించాయని తెలుస్తోంది.

మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం Sunday Magazineతో కలుద్దాం.

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్
ఐడి. prabhanewscontent@gmail.com

Leave a Reply