Andhra prabha effect | ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా…?

  • కూలింగ్‌ కెనాల్‌లో బూడిద నీరు చేరడంపై కలెక్టర్‌ కన్నెర్ర..
  • ఎన్టీటీపీయస్‌ చీఫ్‌ ఇంజనీరు, పర్యవరణ ఇంజనీర్లపై ఆగ్రహాం
  • డ్రెయిన్‌లను శుభ్రం చేస్తుంటే కొంత బూడిద కలిసిందని సీఈ వివరణ
  • పదిరోజుల్లో శాశ్వత పరిష్కారం చూపాలి
  • త్వరలో ప్లాంట్‌ను సందర్శిస్తా..

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ) : ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా…? కూలింగ్ కెనాల్‌లోకి విద్యుత్ కేంద్ర బూడిద కలుస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారు… దాదాపు 104 గ్రామాలకు నీరు అందించే కెనాల్‌ను కాలుష్యం చేయడాన్ని ఎలా సమర్థించగలం..? తీరు మారకపోతే క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.

ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీయస్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను కూలింగ్ కెనాల్‌లో కలుపుతున్న వైనంపై వికృత క్రీడను ఆపలేరా? శీర్షికన బుధవారం ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైంది. విద్యుత్ కేంద్రం నుంచి వస్తున్న బూడిద వల్ల వందలాది గ్రామాల ప్రజలకు తాగునీరు కలుషితం అవుతున్న పరిస్థితిని కథనంలో వివరించారు. దీనిపై ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ స్పందించారు.

ఎన్టీటీపీయస్ చీఫ్ ఇంజనీరు శివరామాంజనేయులు, పర్యావరణ పరిరక్షణ ఇంజనీరింగ్ అధికారి ఉమామహేశ్వరరావు తదితర అధికారులను కలెక్టరేట్‌కు పిలిపించి వివరణ అడిగారు. అస‌లు బూడిద కెనాల్‌లోకి ఎలా చేరిందని ఆరాతీశారు. బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలోని వందకు పైగా గ్రామాల ప్రజలకు తాగునీరు కలుషితం అవుతోంది. లక్షలాది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఆటలు ఆడుతున్నారా? అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్లాంట్‌లోని సెక్యూరిటీ కాలనీలో డ్రైయిన్‌లో పూడుకుపోయిన బూడిదను తొలగించే క్రమంలో కొద్దిగా బూడిద కెనాల్‌లో కలిసిందని చీఫ్‌ ఇంజనీరు శివరామాంజనేయులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కొద్దిగా ఏమిటీ.. ఫోటోల్లో వరదలాగా బూడిద కలుస్తుంటే…. అంటూ క‌లెక్ట‌ర్ మండిపడ్డారు. బూడిద కలిసిన చుక్క నీరు కూడా కూలింగ్‌ కెనాల్‌లో కలవడానికి వీలులేదని…. మరోసారి రిపీట్‌ అయితే చర్యలు తప్పవని కలెక్టర్‌ లక్ష్మీశ హెచ్చరించినట్లు తెలిసింది.

త్వరలో ప్లాంట్‌ను సందర్శిస్తా….

విద్యుత్‌ ప్లాంట్‌ వల్ల పర్యవరణ, ప్రజారోగ్యంకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించేందుకు త్వరలో ప్లాంట్‌ను స్వయంగా సందర్శిస్తానని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. బూడిద కలువకుండ శాశ్వత చర్యలు చేపట్టేందుకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని చీఫ్‌ ఇంజనీరు తెలిపారు. ప్రజారోగ్యమే ముఖ్యమని, ప్లాంట్‌ సీఆర్‌ఎఫ్‌ నిధులతో శాశ్వత చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకురావాలని, వాటికి అనుమతులు ఇస్తామన్నారు.

కలెక్టర్‌ స్పందనపై సర్వత్రా హర్షం….

ఎన్టీటీపీయస్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వచ్చే బూడిద నీరు కూలింగ్‌ కెనాల్‌లో కలువకుండ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ లక్ష్మీశ ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాటు తీరని సమస్యగా ఉన్న ప్లాంట్‌ నుంచి వచ్చే బూడిద సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుందనే నమ్మకం వచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply