బికనీర్ – మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. కేంద్రం త్రివిధ దళాలకు పూర్తి స్వచ్ఛ ఇచ్చిందని గుర్తుచేశారు. మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేసినట్లు మోడీ పేర్కొన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి నేడు వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు. కొత్త స్టేషన్లను జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా బికనీర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులతో అనుబంధంగా ఉన్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం ఐక్యంగా ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 140 కోట్ల మంది భారతీయులను కదిలించిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెపై దాడి చేశామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నివ్వడంతోనే ఇదంతా జరిగిందని మోడీ వెల్లడించారు . ఆపరేషన్ సిందూర్ ద్వారా మన త్రివిధ దళాలు పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టాయని అన్నారు. ఇక పాకిస్తాన్ కుట్రలు నడవనన్నారు. ఇకపై ఉగ్రవాద దాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని, శత్రువుల న్యూక్లియర్ బాంబు దమ్కీలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మన వైపు వచ్చినప్పుడల్లా భారత్ దే గెలుపు అని ఇది పాత భారత్ కాదని ఇది నయా భారత్ అన్నారు. శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ఇప్పుడు మన సైన్యమే డిసైడ్ చేస్తుందని అందుకు తమమా ప్రభుత్వ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. పాక్ కుట్రల్ని ప్రపంచమంతా తెలిపేందుకు మన ఎంపీలు బయల్దేరారన్నారు. పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపిద్దామన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపం అని ఈ ఆపరేషన్ ఆక్రోశం కాదని సమర్థ భారత రౌద్ర రూపం అన్నారు. భారత్ ను ఎప్పటికి తలదించుకోనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆధునిక మౌలిక సదుపాయల కోసం కొనసాగుతున్న మహాయజ్ఞం
దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ఆధునిక మౌలిక సదుపాయలు కల్పించే మహా యజ్ఞం జరుగుతోందని ప్రస్తుతం భారత్ లో ఎటువైపు వెళ్లినా అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయని ప్రధాని అన్నారు. మౌలిక సదుపాయల రంగంలో గతంలో ఖర్చు చేసిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవాళ మోడీ ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో తెలంగాణలోని బేగంపేట, కరీంగనర్, వరంగల్, ఏపీలోని సూళ్లూరుపేట స్టేషన్లు కూడా ఉన్నాయన్నారు. అమృత్ భారత్ స్టేషన్లను ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో నిర్మించామని చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్ ను కాకతీయ రాజుల ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించామని చెప్పారు. కర్ణిమాత ఆశీర్వాదం తీసుకుని ఇక్కడికి వచ్చానని కర్ణిమాత ఆశీర్వాదంతో భారత్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు.
బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. .
కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నామన్నారు. ముంబయి లో అటల్ సేతు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రధాని. తమిళనాడులో పంబన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. బ్రాడ్ గేజ్ మార్గాల్లో మానవరహిత క్రాసింగ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 30 వేల కిలోమీటర్లకు పైగా కొత్త రైలు మార్లాగు వేయించామన్నారు. దేశంలో 70 మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయని దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ కోసం అడుగులు పడుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఆ రైలు పరుగులు తీస్తుందని అన్నారు మోదీ.