America | క‌రిగిపోతున్న‌ డాల‌ర్ డ్రీమ్స్‌ : క‌ష్టాల క‌డ‌లిలో క‌ల‌ల సౌధం

అమెరికాలో మ‌నోళ్ల‌ జీవ‌నం ఆగ‌మాగం
చిన్న నేరం చేసినా తీవ్ర‌మైన చ‌ర్య‌లు
సోష‌ల్ మీడియా పోస్టుల‌పైనా క‌ఠిన ఆంక్ష‌లు
వ్య‌తిరేక పోస్టులు పెడితే జాబ్స్ పోవ‌డం ఖాయం
అమెరికా కాదిది.. జైలు అంటున్న విదేశీయులు
స్వ‌దేశానికి రాలేక‌.. అక్క‌డే ఉండ‌లేక పాట్లు
ట్రంప్ దెబ్బ‌కు వ‌ణ‌కిపోతున్న ఇండియ‌న్స్

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్రప్రభ :

అమెరికా అంటే మ‌హాద్భుతం.. మన ఊరి నుంచి ఎవరైనా అమెరికా వెళ్తున్నారంటే చాలు, వీధి చివర టీకొట్టు దగ్గర నుంచి.. పచ్చని పొలాలు దాటి ఊరి చివర దాకా ఒకటే ముచ్చట. ప‌లానా వాళ్ల‌బ్బాయి అమెరికా పోయిండని క‌థ‌లు, క‌థ‌లుగా చెప్పుకునేవారు. ఇక.. వాళ్లు స్వ‌దేశానికి తిరిగివ‌స్తే దేవుడు దిగివచ్చినట్టు, లేకపోతే అంతరిక్షం నుంచి ఊడిపడ్డ గ్రహాంతరవాసిలాగా చూసేవాళ్లు. షర్టు మీద కోటు వేసుకొని సూటు బూటుతో దిగితే చాలు.. ఊరంతా ఊరేగింపు తీసేవాళ్లు.. అమెరికా అంటే అంత గొప్పగా ఉండేది ఒకప్పుడు.. కానీ కాలాం మారింది . జనం ఎక్కువైతే మ‌జ్జిగ పల్చన అయినట్టు, అమెరికాకు మనోళ్లు క్యూ కట్టడంతో సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ ఏం జరుగుతుందో కళ్లారా చూస్తున్నాం కాబట్టి అమెరికా అంటే ఇప్పుడు ఉలిక్కిపడే రోజులు వ‌చ్చాయి. ఇప్పుడసలు కథ వేరే ఉంది.

సిగ్నల్​ జంప్​ చేసినా ఖేల్​ ఖతమే..

అమెరికా ఇప్పుడు కళ్లు తెరిచింది. ఇన్నాళ్లూ ఊరుకుంది కానీ, ఇప్పుడు అసలు రూపం చూపిస్తోంది. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్టు, సిగ్నల్ జంప్ చేసినట్టు, ఎక్కడ పడితే అక్కడ బండ్లు పార్కింగ్ చేసినట్టు అమెరికాలోనూ వ్య‌వ‌హ‌రిస్తే.. అంతే సంగతి. వెంటనే పట్టుకొని వెనక్కి పంపిస్తున్నారు. ఇక్కడ ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు, దేశద్రోహులను కూడా వెనకేసుకొస్తారు. కానీ, అమెరికాలో అట్లా కాదు. అక్కడ దేశభక్తి అంటే దేశభక్తే దేశాన్ని వ్యతిరేకిస్తే ట్రంప్ లాంటి వాళ్లు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దేశం విడిచి వెళ్లాల‌నా ఆదేశాలు జారీ చేస్తున్నారు.

రూల్స్​ బ్రేక్​ చేస్తే అంతే సంగతి..

సోషల్ మీడియా పిచ్చిలో పడి, తెలిసీ తెలియక మనోళ్లు ఏదేదో పోస్టులు పెడుతున్నారు. పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూనో.. ఇజ్రాయెల్‌ని తిడుతూనో ఏదో ఒకటి రాసేస్తుంటారు. అమెరికాలో అట్లా కాదు.. ఇలాంటివి జ‌రిగితే అంతే, అకౌంట్లోకి మెరుపులా ఒక మెయిల్ వస్తుంది. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. నువ్వు రూల్స్ బ్రేక్ చేశావని, సిస్టమ్‌ని ధిక్కరించావని చెబుతారు. ఏం తప్పు చేశామని అమాయకంగా మొహం పెడితే.. నీ సోషల్ మీడియా పోస్టులే నీ కొంప ముంచాయని లెక్క తేల్చేస్తారు.

వీకెండ్​ పార్టీలు బంద్​..

ఏ చిన్న తప్పు చేసినా కేసు నమోదు అవుతుంది. దాన్నుంచి బయటపడాలంటే కోర్టుల చుట్టూ తిరగాలి.. లీగల్ ఫైట్లు చేయాలి. ఇంకోపక్క ఉద్యోగాలు ఊడిపోతాయి. భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. అమెరికా వెళ్లడం ఒకప్పుడు కల.. కానీ, ఇప్పుడు అమెరికా వెళ్లడమే నరకంలా మారుతోంది. అక్క‌డున్న వాళ్ల‌కు అమెరికా జైలే.. ఇల్లు, ఆఫీస్ త‌ప్ప మ‌రో చోటికి వెళ్లాలంటే త‌నిఖీల భ‌యం ప‌ట్టుకుంది.. ఏ కేసు పెడ‌తారేమోన‌ని చాలామందిలో ఆందోళ‌న ఉంది. వీకెండ్‌ పార్టీలు బంద్.. ప‌బ్‌ల‌లో విందులకు దూరం.. మాస్ గేద‌ర్ మీటింగ్‌ల‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

ట్రంప్​ దెబ్బకు వణికిపోతున్న భారతీయులు..

ఇల్లే క‌దా స్వ‌ర్గ సీమ అంటూ అక్క‌డ‌వాళ్లు ఇంటిలోనే పాట‌లు పాడుకుంటున్నారు.. కారు బ‌య‌ట‌కు తీస్తే ఏ కేసు ప‌డుతుంద‌లోనేని భ‌యంతో కాల్ టాక్సీల‌లో ప్ర‌యాణీస్తున్నారు. ఆఫీసుల‌కు ద‌ర్జాగా కారులో వెళ్లే మ‌న టెక్ బాబులు, టెక్ అమ్మాయిలు ఎంచ‌క్కా ఆఫీస్ బ‌స్సులోనే వెళుతున్నారు. లేదంటే ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవ‌ల‌నే వినియోగించుకుంటున్నారు.. ట్రంప్ దెబ్బ‌కు చాలామంది తెలుగువారు మారిపోయారు.. జైలు కాని జైళ్లో ఉంటున్నామ‌ని ఫోన్ చేసి ఘొల్లు మంటున్నారు. ఎప్1, బి 1, బి 2 వీసాలున్నా త‌ప్పు చేస్తే ఇంటికి పంపేస్తార‌నే భ‌యం అంద‌రిలోనూ ఉంది. ట్రంప్ వార్నింగ్‌ల‌తో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ట్రంప్ ఉన్నాడు.. కాస్త‌ జాగ్రత్తగా ఉండండి. డాల‌ర్ డ్రీమ్స్‌ మోజులో కళ్లు మూసుకొని వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి అడుగు వెయ్యి కళ్లతో ఆలోచించి వేయాల్సిన టైం ఇది అంటూ అక్క‌డున్న‌ వాళ్లు హిత బోధ చేస్తున్నారు.

Leave a Reply