దేవళంపేటలో తీవ్ర ఉద్రిక్తత

  • టీడీపీ ,వైసీపీ వర్గాల ఆందోళన
  • ఘటన స్థలిలో చిత్తూరు ఎస్పీ విచారణ


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా (Chittoor District) గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం దేవళం పేట ప్రధాన కూడలిలోని ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగలే నిప్పు పెట్టారు. కొంతవరకు అంబేద్కర్ విగ్రహం కాలిపోయింది. దళిత సంఘాలు భగ్గమన్నాయి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. మరో వైపు అధికార, ప్రతిపక్ష పార్టీలు రగడకు దిగాయి. ఇటు ఎమ్మెల్యే థామస్ అనుచరులు, అటు వైసీపీ నేత కృపా లక్ష్మీ అనుచరులు పోటాపోటీ ఆందోళనలకు దిగారు. ఇక పోలీసులు దేవళంపేటకు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఘటన స్థలికి చేరుకున్నారు. ఆందోళన కారులను సముదాయిస్తున్నారు. ప్రస్తుతం దేవలం పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి ఆందోళన రగిలిపోతోంది. ఈ ఘటనను హేయమైన చర్యగా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ఎంవి థామస్ వర్ణించారు దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడి నెల్లూరు వైసీపీ ఇన్చార్జి కృపా లక్ష్మి (YCP in-charge Krupa Lakshmi) డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సర్పంచ్ చొక్కా గోవిందయ్య మాట్లాడుతూ… ఈ విగ్రహ వినాశనానికి సతీష్ నాయుడు అతని అనుచరులు పయని, తేజ, బుజ్జి, ఉమాపతి, లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు సహకారంతో దళితులందరూ ఐక్యమత్యంతో రాజకీయాలకు అతీతంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వెదురుకుప్పం మండలం దేవళంపేట ప్రధాన కూడలి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీర్ణించుకోలేని టీడీపీకి చెందిన సతీష్ నాయుడు , సంత గేటుకు అడ్డుగా ఉందని, ఈ విగ్రహాన్ని తొలగించాలని పలుమార్లు ప్రయత్నించాడు. కానీ స్థానిక ప్రజలు దళిత నాయకులు అడ్డుకోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ సందర్భంగా ఎలాగైనా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తానని గతంలో సతీష్ నాయుడు సవాల్ విసిరుతూ మాట్లాడిన విషయాన్ని దళిత సంఘాలు గుర్తు చేస్తున్నాయి. నేడు అనగా గురువారం అర్ధరాత్రి సతీష్ నాయుడు అనుచరులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పి పెట్టారని దేవళం పేట దళితులు ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ కృపాలక్ష్మి, పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని ర్యాలీ నిర్వహించారు.

ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవళం పేట(Temple Peta) కు దళిత సంఘాలు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ధర్నాతో ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళితులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో ఈ అకృత్యానికి పాల్పడ్డారని దళితులు ఆరోపించారు. కొంతమంది కుల ద్రోహులు తమ కులాలను అడ్డుపెట్టుకొని. దళితులను దెబ్బతీయాలని ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆవేశం వెళ్లగక్కారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడీ నెల్లూరు దళితులు, బడుగు బలహీనవర్గాలు డిమాండ్ చేశాయి. దోషులను వెంటనే అరెస్టు చేసి తగిన బుద్ధి చెప్పాలని మన డీఎస్పీ, సీఐ, వెదురుకుప్పం ఎస్ఐకి అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఎం రవి విన్నివించారు. దోషులను శిక్షించాలని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి నేసనూరు మునిచంద్రా రెడ్డి కోరారు.

డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని ప్రభుత్వ విప్ డాక్టర్ వీఎం. థామస్ (Dr. V.M. Thomas) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, వెదురుకుప్పం మండలం దేవళంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం చాలా హేయమైన, నీచమైన చర్య. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ, డీఎస్పీతో మాట్లాడాం, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం అని థామస్ వివరించారు. ఇందుకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారినైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం, అని థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాని(Dr. B.R. Ambedkar statue) కి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని గంగాధర నెల్లూరు వైసీపీ ఇన్ చార్జి కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు. కులం, మతం, ప్రాంతం,రాజకీయాలు కతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలోని భారత రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి..? అని కృపాలక్ష్మీ ప్రశ్నించారు. న్యాయం జరగని పక్షంలో న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర, దేశవ్యాప్తంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కృపా లక్ష్మి హెచ్చరించారు.

Leave a Reply