అంబేద్కర్ కోనసీమ : ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ లభ్యమైంది.తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈనెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు.
చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.
చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.