TG | మన అందరి దేవుడు అంబేద్కర్.. బండి సంజయ్

  • దళితులకే పరిమితం చేయడం సరికాదు
  • నేటి తరానికి స్పూర్తిదాయకం
  • అంబేద్కర్ అనేక అవమానాలు పడ్డారు
  • చదువునంతా దేశానికి ధారపోసిన గొప్పనేత
  • భారతరత్న ఇవ్వని దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్

కరీంనగర్, ఆంధ్రప్రభ : భారతదేశ చరిత్రలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో నిర్వహించిన సెమినార్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ… ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో పాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న సమస్య, అవమానాలు ఎదురైతేనే లక్ష్యసాధన నుండి పక్కకు తప్పుకుంటున్న నేటి తరానికి అంబేద్కర్ జీవితమే స్పూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ ను దళిత జాతికే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. నిజానికి భరత జాతికి అంబేద్కర్ దేవుడని అభివర్ణించారు. ఆ మహనీయుడి చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకే సామాజిక సమరసత దినోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

రాజ్యాంగం వల్లే దళిత బడుగులకు మేలు…
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలువ వల్లే దళిత, బడుగు, బలహీనవర్గాల బిడ్డలంతా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు సహా ఉన్నత పదవుల్లో దళిత, బహుజన బిడ్డలు కొనసాగుతున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష అన్నారు. ఆయనే లేకుంటే మనం ఏమై పోతుంటిమో, ఎంతటి దుర్భర జీవితాలను అనుభవిస్తుంటిమో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక జ్ఞాన శిఖరం. భారతదేశ భవిష్యత్తు అని, ఆయన జీవితమే దేశ ప్రజలందరికీ గొప్ప సందేశమన్నాడు. ఆయన రాసిన రాజ్యాంగమే మనందరికీ నిరంతరం రక్ష అని, అంతటి గొప్ప మహనీయుడి పుట్టక నుండి చనిపోయేదాకా జీవితమంతా కష్టాలే అనుభవించారన్నారు. అడుగడుగునా అవమానాలే. అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తినడానికి తిండలేక అల్లాడిండన్నారు. పస్తులున్నాడని, అంటరానివాడికి చదువెందుకని సమాజమంతా హేళన చేసిందన్నారు. స్కూల్ వెలివేసినా, అడుగడుగునా అవమానించినా కుంగిపోలేదని, అదరలేదని బెదరలేదన్నారు. అంతకంటే కసితో చదువుకున్నాడని, కరెంట్ లేకపోయినా వీధి దీపాల కింద, గుడ్డి దీపాల కింద చదువుకున్నాడన్నారు. ఉన్నత విద్యకు పైసల్లేకుంటే బరోడా మహారాజ్ దగ్గర 10 ఏళ్ల పాటు పనిచేస్తానంటేనే ఆ చదువుకు పైసలిస్తామంటే ఒప్పుకున్నాడంటే చదువు మీద ఎంత మక్కువో అర్ధమైతదన్నారు.

అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్…
అంతటి మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ జీవితాంతం అనేక అవమానాలకు గురిచేసింది. బ్రిటీష్ పాలనను మించి అవమానించింది. అంబేద్కర్ చరిత్రను తెరమరుగు చేసేందుకే అడుగడుగునా యత్నించింది. ఆ జ్ఞాన శిఖరాన్ని దళిత జాతికే పరిమితం చేయాలని చూసింది. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయనను తక్కువ చేసింది. ఆర్టికల్ 370 దేశానికి మంచిది కాదని, ఒకే దేశానికి రెండు చట్టాలు కరెక్ట్ కాదని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆయనను అవమానిస్తూ ఆ ఆర్టికల్ ను ఆమోదించింది. హిందూ స్మృతి బిల్లును ఆమోదించింది. హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే అడ్డు తగిలి అవమానించింది.


కాంగ్రెస్ తీరుతో విసుగు చెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి రెండుసార్లు అంబేద్కర్ ను ఓడించింది. డూప్లికేట్ గాంధీ కుటుంబ సభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుంది. కానీ ఆ అంబేద్కర్ మహాశయుడికి ఇవ్వకుండా, ఆయనను ఓడించిన కజ్రోల్కర్‌కు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. దళితుడిగా పుట్టడమే పాపమైందనే బాధతో బౌద్ద మతాన్ని స్వీకరించేలా చేసింది. చివరకు అంబేద్కర్ చనిపోతే కూడా దేశ రాజధాని ఢిల్లీలో అంత్యక్రియలు జరగనీయకుండా అడ్డుకుందన్నారు. మృతదేహాన్ని ముంబయికి తరలించింది. ఆ మృతదేహాన్ని పంపినందుకు విమాన చార్జీలు చెల్లించాలంటూ పుట్టెడు దు:ఖంలో ఉన్న అంబేద్కర్ కుటుంబ సభ్యులకు రశీదు పంపి ఘోరంగా అవమానించిందన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా నిరాకరించిందన్నారు. ఎందుకంటే అంబేద్కర్ కు పేరొస్తది, భావితరాలు ఆయననే స్మరించుకుంటే డూప్లికేట్ గాంధీ కుటుంబ చరిత్ర తెరమరుగైపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ఇదంతా చేసిందన్నారు. అంబేద్కర్ రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే ఇది సరికాదని నెహ్రూ అన్నాడు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదించకుండా బీసీలను అవమానించిందన్నారు. రిజర్వేషన్లు మన సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తాయని చెప్పడమే కాకుండా లోక్ సభలో ఈ రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ తిరస్కరించారు. ఓబీసీ రిజర్వేషన్లను ప్రతిపాదించిన కాకా కలేల్కర్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తిరస్కరించిందన్నారు. ఆశ్చర్యమేందంటే రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసింది. మైనారిటీ సంతూష్టీకరణ కోసం మైనారిటీ విద్యా సంస్థలకు అనేక మినహాయింపులిచ్చింది. మైనారిటీ విద్యా సంస్థల్లో అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిషేధించిందన్నారు.

అంబేద్కర్ పట్ల బీజేపీకి నిబద్దత…
అంబేద్కర్ కు భారతరత్న అవార్డు వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ. అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. పంచతీర్థాలను అభివృద్ధి చేసినం. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసినం. సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహం ఏర్పాటు చేసినం. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించినం. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టినం. ఆర్టికల్ 370ని రద్దు చేసినం. NCBC (జాతీయ బీసీ కమిషన్) కి రాజ్యాంగ బద్ధత కల్పించినం. దళిత, ఆదివాసీలకు రాష్ట్రపతిగా చేసినం.12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించినం. ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నం. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీయేనన్నారు.

Leave a Reply