Ambati Rambabu Arrest | టీడీపీ నేతల ఫిర్యాదు..

Ambati Rambabu Arrest | టీడీపీ నేతల ఫిర్యాదు..

Ambati Rambabu Arrest, తిరువూరు, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత, బాధ్యతారహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన పై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు తిరువూరు పట్టణంలో సీఐ, ఎస్‌ఐలను కలిసి వ్రాతపూర్వకంగా పిర్యాదు అందజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి పై రాజకీయ విమర్శల పేరిట వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, ప్రజా నేత గౌరవాన్ని కించపరిచే స్థాయికి వెళ్లాయని, ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి సంయమనం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, చట్టానికి అతీతంగా ఎవరూ ఉండరని వారు స్పష్టం చేశారు.

రాజకీయ పదవులు ఉన్నాయనే కారణంతో ఎవరినీ కాపాడకూడదని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. అంబటి రాంబాబు పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సీఐ, ఎస్‌ఐలను డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a Reply