ఘనంగా అమరజీవి జయంతి వేడుకలు..

తిరువూరు, ఆంధ్రప్రభ ; ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రావు ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితాన్ని అంకితం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ పలువురు నాయకులు ప్రసంగించారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు బొమ్మసాని మహేష్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆయన త్యాగం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

ఆర్యవైశ్య నాయకులు భూమా సురేష్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు చెన్నైలో జన్మించి చిన్నతనంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరించారని చెప్పారు. హరిజనోద్ధరణతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. సీనియర్ నాయకులు డాక్టర్ జయసింహా మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షలు అనుభవించారని వివరించారు.

1952 అక్టోబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని చెప్పారు. తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ ఆకుల దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ, 58 రోజుల దీక్ష అనంతరం 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు అమరజీవిగా మారారని తెలిపారు. ఆయన త్యాగం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.

ఆయన గౌరవార్థం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కు ఆయన పేరును నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్యవైశ్య నాయకులు దూపకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ, అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.

మహిళా నాయకురాలు భూమా స్వాతి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. మన పిల్లలకు కూడా ఆయన జీవితం, త్యాగం గురించి తెలియజేయడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply