Amaravati | ఏపీ డ్రీమ్ క్యాపిట‌ల్‌ – రేపే మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం

మోదీ చేతుల మీదుగా పలు శంకుస్థాపనలు
రాజధాని పనులను ప్రారంభించినున్న ప్రధాని
₹49,040 కోట్ల పనులకు శ్రీకారం
మరో ₹57,962 కోట్ల పనులకూ పచ్చ జెండా
అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు
మూడేళ్లలోనే మౌలిక సదుపాయాల కల్పన
భారీ జన సమీకరణ.. అమరావతి రైతులకు ప్రత్యేక ఆహ్వానం
రాజధాని ప్రాంతంలో నేటి రాత్రి నుంచే ట్రాఫిక్ ఆంక్ష‌లు

వెల‌గ‌పూడి, ఆంధ్రప్రభ :
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతిలో శుక్రవారం పర్యటించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనలో లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమరావతిలో చేపట్టే ₹49,040 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలు, ఆలిండియా సర్వీసెస్‌ అధికారుల బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

డీఆడ్​డీవో పరిశోధనా కేంద్రం..

రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో), డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వే శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. వీటి నిర్మాణానికి ₹57,962 కోట్లు ఖర్చు చేయనున్నారు. నాగాయలంకలోని గుల్లలమోద దగ్గర ₹1,500 కోట్లతో మిస్సైల్‌ టెస్ట్‌ రేంజ్‌ సెంటర్‌ నిర్మాణానికి వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

రైల్వే లైన్లకు ప్రారంభోత్సవం..

విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‌కు కూడా శంకుస్థాపన చే స్తారు. అలాగే, ₹293 కోట్ల వ్యయంతో గుంతకల్లు వెస్ట్‌ నుంచి మల్లప్పగేటు వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు, ₹3,176 కోట్లతో నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ₹3,680 కోట్ల విలువైన పలు నేషనల్‌ హైవే పనులను ప్రారంభిస్తారు. ₹254 కోట్లతో పూర్తిచేసిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్‌ను, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం రైల్వేలైన్లకు కూడా మోదీ ప్రారంభిస్తారు. అనంత‌రం ఇక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ ప్రసంగించనున్నారు.

ప్రజా రాజాధానిగా అమరావతి : సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందని, అన్ని వర్గాల ప్రజలూ, యువత ఆకాంక్ష తీరే విధంగా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం ఇచ్చాయని తెలిపారు. రాజధానిలో ₹49,040 కోట్ల పనులకు శుక్రవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. వాటితో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేలకు సంబంధించిన మరో ₹57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.

అయిదు లక్షల మంది వస్తారని అంచనా..

ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వ అంచనా వేస్తోంది. రాజధానికి తరలివచ్చే ప్రజల కోసం ప్రభుత్వం రవాణా వసతి కల్పిస్తోంది. 8 వేల బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సులు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1400 బస్సులు ఏర్పాటు చేసింది. ఇవాళ రాత్రికి సంబంధిత గ్రామాలకు బస్సులు చేరుకోనున్నాయి.

నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల పరిధిలో భారీ వాహనాలకు గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధించారు. విజయవాడ, అమరావతివైపు భారీవాహనాలు రాకుండా వేరే మార్గాలకు తరలిస్తున్నారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు హెచ్చరించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: మంత్రి నారాయణ

అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం మధాహ్నం 3:20కి ప్రధాని మోదీ వస్తారని చెప్పారు. ప్రధాని పర్యాటన కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు. 29 గ్రామాల ప్రజలను రైతులను స్వయంగా సీఎం చంద్రబాబు ఆహ్వానించారని, రైతుల త్యాగం మరువలేనిదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

అందుబాటులో ప్రత్యేక మెడికల్ టీం: మంత్రి పయ్యావుల కేశవ్

ప్రధాని మోదీ సభా ప్రాంగణం సిద్ధం అయ్యిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పార్కింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బస్ దిగిన తర్వాత పెద్దగా నడవడానికి ఇబ్బంది లేకుండా వేదిక నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రత్యేక మెడికల్ టీం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవం కోసం రాష్ట్రం మొత్తం ఉత్సాహంగా కనిపిస్తోందని మంత్రి పయ్యావుల అన్నారు.

మూడు రాజధానుల పేరుతో జగన్ హింస: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో పెట్టిన హింస అందరూ చూశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు: మంత్రి నాదెండ్ల మనోహర్

రాజధాని కార్యక్రమం మనదనే భావన అందరికి వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధాని సభకు ఏర్పాట్లు అన్ని జరిగాయని తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

సభ భద్రత చాలా ముఖ్యం: నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్

ప్రధాని బహిరంగ సభకు సంబంధించి మంత్రులు అధికారులు సమావేశం నిర్వహించారని నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ తెలిపారు. ఈ మేరకు అధికారులు భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు. బహిరంగ సభకు వచ్చే వారికి భద్రత చాలా ముఖ్యమని అన్నారు. వర్షం వస్తే ఏమి చేయాలనే అంశంపై దృష్టి పెట్టామనిచెప్పారు. తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. ఎలాంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ సూచించారు.

Leave a Reply