Amaravati : ఎలక్ట్రానిక్ కన్ను నిఘాలో జగన్ నివాసం

అమరావతి – ఎపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంట్లో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం కూడా ఉన్న వైఎస్ జగన్ కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

తాజాగా జగన్ ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనల్ని కారణంగా చూపుతూ ఆయన ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించింది..

తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ఉంటున్న రోడ్డులో గతంలో వైసీపీ ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కరకట్టలా ఉన్న రోడ్డును భారీగా విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయించింది. సీఎం నివాసానికి వెళ్లే దారి కాబట్టి రోడ్డుపై బ్యారికేడ్లు పెట్టి ఆంక్షలు కూడా విధించింది. దీంతో ఎవరూ అనుమతి లేకుండా ఆ రోడ్డులోకి వచ్చే వీలుండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్ధితి మారిపోయింది.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జగన్ ఇంటి రోడ్డుపై ఉన్న బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు.. సాధారణ ప్రజలకు రాకపోకలకు అనుమతించారు. దీంతో కొన్ని నెలలుగా ఇక్కడ సాధారణ రాకపోకలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వరుసగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఇక్కడ వైసీపీ కార్యాలయాన్ని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు కూల్చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఇంటి ముందు కార్లు, బైక్ లతో హారన్లు కొడుతూ హంగామా చేశారు. తాజాగా ఓ అగ్నిప్రమాదం కూడా చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ఆఫీస్ కమ్ జగన్ నివాసంగా ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వాలని కోరింది. దీనికి వైసీపీ నిరాకరించడంతో చేసేది లేక రోడ్డుపైనే జగన్ ఇంటికి 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ సిబ్బంది నిన్న ఈ సీసీ కెమెరాలను బిగించి వెళ్లారు. ఇవాళ్టి నుంచి ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రోడ్డుపై జరిగే ఘటనలతో పాటు జగన్ ఇంటికి వచ్చే వారి కదలికల్ని సైతం గమనించేందుకు వీలు కలిగింది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *