Amanpreet Singh | డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి సోదరుడి పరారీ
Amanpreet Singh | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాసాబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు రోజురోజుకూ సంచలన మలుపులు తిరుగుతోంది. ప్రముఖ నటి సోదరుడైన అమన్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఈగల్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసు (Police) బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ట్రూప్ బజార్‌కు చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అరెస్టులతో అమన్‌ప్రీత్ పేరు బయటపడింది. ఈ ఇద్దరి నుంచి అతడు మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది.
అరెస్టు చేసిన వ్యాపారుల నుంచి 43 గ్రాముల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కూడా అమన్‌ప్రీత్ సింగ్ (Amanpreet Singh) సైబరాబాద్ పోలీసులకు చిక్కి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అమన్‌ప్రీత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కేసు నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై మరిన్ని ఆధారాలు వెలుగులోకి తేవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

