హైదరాబాద్ – ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ పరిధిలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేయడం ఇక నిషేధం. ఈ మేరకు సర్క్యులర్ జారీ అయింది..
యూనివర్శిటీ పరిదిలోని వివిధ శాఖలు, విభాగాలు, కళాశాలలు, స్టడీ సెంటర్లు, పరిపాలనా భవనాల్లో ఈ నిషేధం వర్తిస్తుంది.విద్యార్థులు తరచూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాల్లో పాల్గొంటోండటం, ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం వల్ల యూనివర్శిటీ కార్యకలాపాలు సజావుగా సాగట్లదేని, ఆటంకం కలుగుతోందని అధికారులు భావిస్తోన్నారు.
పరిపాలన, విద్యాపరమైన చర్యల్లో అడుగు ముందుకు పడట్లేదని చెబుతున్నారు.కొన్ని, కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన ఆందోళనలు సైతం తలెత్తుతోన్నాయని యూనివర్శిటీ ఉన్నతాధికారులు నిర్ణయానికొచ్చారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి యూనివర్శిటీ క్యాంపస్ ప్రాంగణంలో కఠిన నియమ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.విశ్వవిద్యాలయ భవనాల్లోకి అనధికారికంగా ప్రవేశించడం, ధర్నాలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను నిర్వహించడం, పరిపాలనా లేదా విద్యాపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే నినాదాలు చేయడం వంటి కార్యకలాపాలను నిషేధించినట్లు వెల్లడించింది.
ఈ మేరకు రిజిస్ట్రార్ ఓ సర్కులర్‌ను జారీ చేశారు.యూనివర్శిటీ అధికారులు, సిబ్బందిని తమ విధులను నిర్వహించకుండా అడ్డుకోవడాన్ని ఇందులో చేర్చారు. అధికారులపై దుర్భాషలాడటం, అసభ్యకరమైన లేదా అవమానకరమైన భాషను ప్రయోగించడాన్ని నిషేధం జాబితాలో తీసుకొచ్చారు.
విద్యార్థులు ఎదుర్కొనే నిర్దుష్టమైన సమస్యలను పరిష్కరించడానికి యూనివర్శిటీ అధికార యంత్రాంగం కట్టుబడి ఉందని తేల్చి చెప్పింది. విద్యార్థుల నిజమైన సమస్యలను పరిష్కరించే విషయంలో రాజీపడబోమని పేర్కొంది. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటోన్న విద్యార్థులు సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపింది.