KNL | రాయ‌ల‌సీమ పారిశ్రామికాభివృద్ధికి విమాన స‌ర్వీస్ ఎంతో కీల‌కం.. మంత్రి భ‌ర‌త్

కర్నూల్ బ్యూరో, జూన్ 3, ఆంధ్రప్రభ : రాయ‌ల‌సీమ‌ను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భ‌ర‌త్ అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో మంత్రి టి.జి భ‌ర‌త్ విజ‌య‌వాడ – క‌ర్నూలు విమాన స‌ర్వీసుల షెడ్యూల్ పోస్టర్‌లను విడుదల చేశారు. జూలై 2వ తేదీ నుండి విజ‌య‌వాడ నుండి క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యానికి విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు ఇటీవ‌లే కేంద్ర విమాన‌యాన శాఖ అంగీక‌రించింది. వారంలో మూడు రోజుల పాటు ఈ విమాన స‌ర్వీసు న‌డుస్తుంద‌ని ఇండిగో ప్ర‌తినిధులు తెలిపారు. విజ‌య‌వాడ‌లో మ‌ధ్యాహ్నం 03.45 గంటలకు బ‌య‌లుదేరి ఓర్వ‌క‌ల్లుకు 04.50 గంటలకు చేరుకుంటుంద‌ని, 05.10 గంటలకు ఓర్వ‌క‌ల్లులో బ‌య‌లుదేరి విజ‌య‌వాడ‌కు 06.15 గంటలకు చేరుకుంటుంద‌ని తెలిపారు. విమాన టికెట్ ధర రూ.2533 నుండి మొదలవుతాయని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ… రాయ‌ల‌సీమ‌లో భారీగా ప‌రిశ్ర‌మ‌లు రానున్నాయ‌ని తెలిపారు. లేపాక్షి నుండి కొప్ప‌ర్తి, ఓర్వ‌క‌ల్లు వ‌ర‌కు ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ ఎంతో అభివృద్ధి చెంద‌నుంద‌ని చెప్పారు. ఈ ప్రాంతంలో డిఫెన్స్, డ్రోన్, ఎల‌క్ట్రిక్‌, గ్రీన్ ఎన‌ర్జీకి సంబంధించిన ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌న్నారు. ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఓర్వ‌క‌ల్లులో సెమీకండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ రాబోతుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం 2.O పాల‌సీ విడుద‌ల చేసిన వెంట‌నే ఈ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు.

ఓర్వ‌క‌ల్లుకు విమాన స‌ర్వీసు ఉండ‌టం వ‌ల్ల పారిశ్రామిక‌వేత్త‌లు, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల రాక‌పోక‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. త్వ‌ర‌లోనే హైకోర్టు బెంచ్ క‌ర్నూలులో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌న్నారు. మొదటగా ప్ర‌తి సోమ‌, బుధ‌, శుక్ర‌వారాల్లో ఇండిగో విమాన స‌ర్వీసు న‌డుస్తుంద‌న్నారు. రానున్న రోజుల్లో ప్రతి రోజూ విమాన స‌ర్వీసు అందుబాటులో ఉండేలా తమ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇండిగో విజయవాడ సేల్స్ మేనేజర్ మోహిత్ కృష్ణ, కర్నూలు సేల్స్ మేనేజర్ రవిబాబు, విమానాశ్రయ అసిస్టెంట్ మేనేజర్ సుభాని, సుజన్ పాల్గొన్నారు.

Leave a Reply