ప్రైవేటు ఆలయాల అభివృద్ధికి అడ్వైజరీ కమిటీ
- కాశీబుగ్గ దుర్ఘటన బాధాకరం
- సంఘటనపై సమగ్ర దర్యాప్తు
- రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అనం రామనారాయణరెడ్డి వెల్లడి
పలాస(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఒక అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుడతామని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ రోజు పలాసకు వచ్చిన మంత్రి రామనారాయణ రెడ్డి(Minister Rama Narayana Reddy) ఆలయ సందర్శన, క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ శాఖ పై సమీక్ష చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఝటన బాధాకరమన్నారు. ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు. ఆలయం పరిసరాలను పరిశీలించి, ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించానని, ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం(accident) మని, సమగ్ర ఏర్పాట్లు చేసి ఉంటే నివాళులర్పించే వారమని తెలిపారు. సొంత నిధులతో భక్తులు నిర్మించిన ఈ ఆలయం అత్యంత విశిష్టమైనదన్నారు. తిరుమల తరహాలో ఇంత పెద్ద ఆలయం నిర్మించిన వ్యక్తి, భక్తుల భక్తి ప్రశంసనీమైనదని ప్రశంసించారు.
స్థపతులు, అధికారులు సలహాలు తీసుకుని ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఆలయం(Private Temple) అయినా ప్రభుత్వం బాధ్యతగా స్పందించిందన్నారు. నిన్ననే మంత్రి అచ్చం నాయుడు, ఎమ్మెల్యే శిరీషతో మాట్లాడి పరిస్థితి నిన్న తెలుసుకున్నామని, ముఖ్యమంత్రి వెంటనే అధికారులను దర్యాప్తునకు ఆదేశించారన్నారు. కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ గారు విచారం వ్యక్తం చేసి పరిహారం ప్రకటించారని, దేవాదాయ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని మంత్రి అన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు క్షతగాత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
ఏకాదశి నాడు ఇలా జరగడం నిజంగా బాధాకరమని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. కలెక్టర్(Collector) నివేదిక ఆధారంగా ఆలయం అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నాలుగు నెలల క్రితమే ప్రారంభమైన ఈ ఆలయం పునఃప్రారంభానికి ముందు ఆగమ పండితుల సూచనలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్లు పూర్తి నివేదిక ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి గౌతు శివాజీ, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్(K. Ramachandra Mohan), ప్రాంతీయ సంయుక్త కమిషనర్, రాజమహేంద్ర వరం వి.త్రినాథ రావు, సింహాచలం దేవస్థానం జాయింట్ కమిషనర్ ఎన్.సుజాత, ఉప కార్యనిర్వహక ఇంజనీర్ కె.వి.సి.క్రష్ణా రావు, సహాయ కమిషనర్ , విశాఖపట్నం బి.ఆర్. బి.వి.వి.ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారు.

