ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై…!

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో : ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) దందాలకు బానిసై ఎస్‌బీఐ బ్యాంక్ (SBI Bank) క్యాషియర్ తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతుంది. లక్కీ భాస్కర్ సినిమా (Lucky Bhaskar Movie) త‌ర‌హాలో ఇక్కడ బ్యాంకులో పని చేసే క్యాషియర్ (Cashier) లాకర్ల నుండి భారీ మొత్తంలో బంగారం, నగదుతో ఊడయించడం విశేషం. మంచిర్యాల జిల్లా (Manchiryala District ) చెన్నూరు(Chennuru)లో ఎస్‌బీఐ క్యాషియ‌ర్‌ రూ. 15 కోట్ల విలువైన బంగారం, నగదుతో పరారైన ఘటన క‌ల‌క‌లం రేపిన సంగ‌తి విదిత‌మే. విచార‌ణ‌లో ఇది ల‌క్కీ భాస్క‌ర్ -2 సినిమా అంటూ ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

బెట్టింగ్ దందాల‌కు పాల్ప‌డుతూ…

చెన్నూరు ఎస్‌బీఐ బ్రాంచ్ -2 లో క్యాషియర్ గా పనిచేస్తున్న నరిగె రవీందర్ కొంతకాలంగా ఆన్లైన్ లో బెట్టింగ్ దందాలకు పాల్పడుతూ తన నెల జీతం డబ్బులతో పాటు బ్యాంకు లాకర్ల నుండి భారీ మొత్తంలో క్యాష్ ను మాయం చేస్తూ వచ్చాడు. రెండు, మూడు రోజులకు ఒకసారి జరిగే ఆడిట్ విచారణ సందర్భంగా ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు కస్టమర్ల నుండి వడ్డీకి చేబదులు తీసుకొని తిరిగి లాకర్లలో డిపాజిట్ చేస్తూ వచ్చాడు.

క్యాషియర్ రవీందర్ వ్యవహారం బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడంతో తన బండారం బయటపడుతుందని గ్రహించి వారం రోజుల కిందటే రవీందర్ సెలవు పై వెళ్లాడు. బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసులు మూడు రోజులుగా విచారణ జరపగా బ్యాంకు మేనేజర్ (Bank Manager) మనోహర్ రెడ్డి ప్రమేయంతోనే క్యాషియర్ ఘరానా మోసం (Gharana Fraud) చేసినట్టు వెల్లడైంది.

కస్టమర్లు లబోదిబో…
బంగారం నగలు, ఆభరణాలు తాకట్టుపెట్టి అత్యవసర పనుల కోసం బ్యాంకు రుణాలు పొందిన కస్టమర్లు తమ సొత్తు మాయమైందని తెలిసి లబోదిబోమంటున్నారు. చెన్నూరు ప్రాంతంలో 720 మందికి పైగా కస్టమర్లు బ్యాంకులో లావాదేవీలు నిర్వ‌హిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన క్యాషియర్ రవీందర్ తనకున్న పరిచయాల మేరకు ఖాతాదారుల నుండి సుమారు రూ.20 లక్షల పైనే చేబదులు తీసుకుని ఊడాయించినట్టు తెలిసింది.

ఎస్బీఐ బ్యాంకు లాకర్ల నుండి 5.5 కిలోల పైనే బంగారం, వెండి నగలు, విలువైన అభరణాలు దోచుకెళ్లిన క్యాషియర్ రవీందర్ మంచిర్యాలలోని ప్రైవేట్ బ్యాంకులు(Private Banks), ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టుపెట్టి తన అవసరాల కోసం నగదు రుణం తీసుకున్నట్టు తెలిసింది. బ్యాంకులో దాచిపెట్టిన తమ ఆభరణాలు, నగలు ఇవ్వాలని కస్టమర్లు ఆందోళన చేయడంతో బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసులు సర్ది చెప్పి త్వరలో ఇప్పించేలా చూస్తామని భరోసా కల్పించారు.

తవ్విన కొద్ది అక్రమాలు..!
ఢిల్లీ (Delhi), హైదరాబాద్(Hyderabad) నుండి వచ్చి నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్న అధికారులకు క‌ళ్లు బైర్లు కమ్మే రీతిలో అక్రమాలు బయటపడ్డాయి. కస్టమర్లు బ్యాంకు లాకర్లలో దాచిన రూ.12.61 కోట్ల విలువైన బంగారు నగలు, కోటి 10 లక్షల నగదు మాయం కావడం చూసి నువ్వేర పోయారు. బ్యాంకు మేనేజర్ మనోహర్ రెడ్డి వద్ద కూడా లాకర్ల తాళం చెవులు ఉంటాయని, ప్రతిరోజు ఆడిట్ చేయాల్సిన మేనేజర్ నిర్లక్ష్యంగా ఉండడం అనుమానాలకు తావిచ్చింది. మేనేజర్ మనోహర్ రెడ్డి, కీలక సూత్రధారి క్యాషియర్ రవీందర్ పై చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.

Leave a Reply