- బెల్లంపల్లిలో రూ.18 కోట్ల రోడ్డు విస్తరణ పనులు షురూ
బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ): బెల్లంపల్లి పట్టణంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీతో ట్రాఫిక్ సమస్యలు ఊహించిన దానికంటే వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ రోడ్డు విస్తరణ పనులను ముమ్మరం చేసింది.
పట్టణ రూపురేఖలను పూర్తిగా మార్చేలా రూపొందించిన ఈ సమగ్ర ప్రాజెక్ట్‌లో ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ కాలువలు, ట్రాఫిక్ జంక్షన్ ఆధునీకరణ వంటి పలు పనులు ఉన్నాయి. మొత్తం రూ.18 కోట్ల వ్యయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
పనుల వివరాలు.. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు?
పట్టణ అభివృద్ధి కోసం ప్రస్తుతం నాలుగు ప్రధాన విభాగాల్లో పనులు జరుగుతున్నాయి. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి కాంటా క్రాస్ రోడ్స్ వరకు 2 కి.మీ. రోడ్డు నిర్మాణం రూ.6.7 కోట్లతో చేపడుతున్నారు.
ఇదే రూట్‌లో ఇరు వైపులా వర్షపు నీటి ప్రవాహాన్ని సులభతరం చేసేందుకు రెండు కాలువల నిర్మాణాన్ని రూ. 5 కోట్లతో చేపడుతున్నారు. వీటితో పాటు, పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డు నుంచి బెల్లంపల్లి బస్తీలోని పోచమ్మగడ్డ చౌరస్తా వరకు ఒక కిలోమీటర్ రోడ్డు పనులను రూ.1 కోటి 12 లక్షలతో, అలాగే పాత బస్టాండ్ నుంచి శిశుమందిర్ రోడ్డు మీదుగా అంబేడ్కర్ నగర్ వరకు రోడ్డు పనులకు మరో రూ. 1.12 కోట్లతో పనులు కూడా జరుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో అత్యంత రద్దీగా ఉండే కాంటా చౌరస్తా అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 3 కోట్లతో పనులు చేపట్టనున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మెయిన్ రోడ్ల వెడల్పును 100 ఫీట్లకు పెంచుతుండగా, పాతబస్టాండ్ నుంచి శిశుమందిర్ రోడ్డు మీదుగా అంబేద్కర్ నగర్ రోడ్డు వరకు 60 ఫీట్ల వెడల్పుతో విస్తరణ పనులు జరుగనున్నాయి.

