- నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
ACTIONS| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించిన, పర్యవేక్షణ కరువైన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని.. నాణ్యత లోపంగా పనులు చేసే కాంట్రాక్టును కూడా బ్లాక్ లిస్టులో ఉంచుతామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పర్యవేక్షణలో నంద్యాల దిశా కమిటీ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంత శ్రామిస్తున్నారో ఎంపీలుగా మాకు తెలుస్తోందన్నారు.
అన్ని శాఖల అధికారులు వీటిని గమనించి మన నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా, నిరంతర పనుల పర్యవేక్షణ, నాణ్యతప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. మనకు కేంద్రం ఇచ్చిన నిధులు సకాలంలో ఖర్చు చేస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని.. ఇది అధికారులు గుర్తించి పనులు చేయాలని ఆమె కోరారు. అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు.

దిశా సమావేశంకు జాతీయ రహదారుల అధికారులు రాకపోవడం పట్ల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కువ ఫిర్యాదులు ఆ రెండు శాఖల నుంచే వస్తున్నాయని.. జిల్లా కలెక్టర్ ద్వారా త్వరలో ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల అధికారులతో ఈ నెలాఖరులోనే సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. 82 కేంద్ర ప్రభుత్వ పథకాలపై దిశా సమావేశంలో సమీక్షా నిర్వహించినట్లు ఆమె వివరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల, అధికారుల సహకారం ఎంతో అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల, అధికారుల సహకారం ఎంతో అవసరం అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, రాష్ట్రస్థాయి దిశా కమిటీ సభ్యులు నూకల సుస్మిత, పవన్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, ఎల్లాల బాబు, డాక్టర్ బాబన్ డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

