ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో ఓ నిందితుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన అరుణ్ (Arun) పై గతంలో పోక్సో కేసు నమోదయింది. కోర్టు విచారణకు నిందితుడు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తుండగా గుడిహత్నూర్ (Gudihatnur) బస్టాండ్ లో ఉన్న నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, తన చేతిలో ఉన్న బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రక్తపు గాయాలతో ఉన్న నిందితుడు అరుణ్ ను వెంటనే పోలీసులు ఆదిలాబాద్ రిమ్స్ (rims) కు తరలించగా, చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ నిందితుడు గతంలో బ్లేడుతో గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై, హోంగార్డ్ పై దాడి చేసి గాయపరిచాడు. బ్లేడుతో కోసుకొని హల్చల్ చేయడం ఇది మూడోసారి అని, ఎన్ బి డబ్ల్యు వారెంట్ లో భాగంగానే నిందితుని పట్టుకునేందుకు ప్రయత్నించామని ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.