ప్రమాదమా..? సహజ మరణమా…?
ఖమ్మం, (ఆంధ్రప్రభ):
ఖమ్మం నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎఫ్‌సీఐ బైపాస్ రోడ్డులోని ప్రైవేటు డిగ్రీ కళాశాల సమీపంలో ఒక వ్యక్తి రోడ్డుపక్కన విశ్రాంతి తీసుకుంటుండగా కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. కారు నడిపిన వ్యక్తి నాళం సతీశ్ ఇంట్లోకి వెళ్లే క్రమంలో రోడ్డుపై పడుకుని ఉన్న వ్యక్తిని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వ్యక్తిని పరిశీలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. చనిపోయిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా భావించి మార్చురీకి తరలించారు. అయితే.. ఈ ఘటనను సాధారణ మరణంగా చూపే ప్రయత్నం చేసారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
విషయం బయటకు పొక్కడంతో వెనక్కు తగ్గిన ప్రయత్నం..
ఈ ఘటనపై ప్రారంభంలో దానిని “సాధారణ మరణం”గా మలచాలనే ప్రయత్నం కొంత మంది చేసినట్లు సమాచారం. కానీ విషయం నెమ్మదిగా బయటకు పొక్కడంతో, ప్రజల్లో చర్చ మొదలవడంతో వారు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. రోడ్డు పక్కన కారు తొక్కిన ఘటనపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రారంభంలో కేసు తేలికగా మలచాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకున్నారని ప్రజల్లో ప్రచారం జరుగుతోంది. విషయం బహిరంగం కావడంతో పోలీసులు కూడా సక్రమంగా దర్యాప్తు ప్రారంభించారు. కారు యజమాని పాత్రపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మృతుడు గుర్తింపు – కేసు నమోదు..
పోలీసులు ఆరా తీశాక మృతుడు కూసు మంచి మండలం చేగొమ్మకు చెందిన కుసుమ ఉపేందర్ (55) అని గుర్తించారు. ఆయన భార్యతో కలిసి ఖమ్మానికి ఓ కార్యక్రమానికి వచ్చారని తెలిసింది. తిరుగు ప్రయాణంలో రాత్రి ఆలస్యంగా కావడంతో రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవగారంలో భద్రపరిచారు. ఉపేందర్ కుమారుడు వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఇన్స్పెక్టర్ మోహన్‌బాబు తెలిపారు.
న్యాయం కోరుతున్న కుటుంబ సభ్యులు..
మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదమా..? లేక నిర్లక్ష్యమా..? అన్న దాని పై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విషయం దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు జరిగిందో కూడా తెలుసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన వల్ల స్థానికంగా విషాదం అలుముకుంది. కారు యజమాని సతీశ్ బాధ్యత నిర్ధారణ చేసుకోవాలంటూ పౌరులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ మరణం పేరుతో ఈ సంఘటనను మూసివేయొద్దని ప్రజలు గళమెత్తుతున్నారు. పోలీసు శాఖ దర్యాప్తు ఫలితాలపై అందరి చూపు నిలిచింది.

