Accident | వైద్యం కోసం నిరీక్షిస్తున్న క్షతగాత్రులు

Accident | వైద్యం కోసం నిరీక్షిస్తున్న క్షతగాత్రులు
ఆజంనగర్ పీహెచ్‌సీలో నిర్లక్ష్యం
అదుపుతప్పిన ఆటో.. ఉపాధ్యాయులకు గాయాలు
ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయులకు అందని ద్రాక్షలా చికిత్స
అత్యవసర వేళల్లో వైద్య సిబ్బంది గైర్హాజరు
గ్రామస్తుల ఆగ్రహం ..ఆసుపత్రికి తాళాలు
ఉపాధ్యాయుల ప్రమాదంతో వెలుగులోకి పీహెచ్‌సీ అవస్థలు
Accident | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో జరిగిన తాజా ఘటన స్పష్టంగా తెలియజేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయానికి హాజరు కాకపోవడం, సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ ప్రమాదంతో పిహెచ్సీలో స్థానిక ప్రజలు పడుతున్న అవస్థలు బహిర్గతమయ్యాయి.
అదుపు తప్పిన ఆటో, ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలు..
ఆజంనగర్ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం బూర్కపల్లి , ఆజాంనగర్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న ఆటో ముందు టైర్ నట్లు ఊడి ( బ్లాస్ట్ అయి ) ఆటో అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ తప్ప మిగతా సిబ్బంది ఎవరూ లేరు. ఉదయం పది గంటలు దాటినా వైద్య సిబ్బంది ఆస్పత్రికి రాకపోవడంతో గాయపడిన వారికి తక్షణ చికిత్స అందలేదు. దీనితో మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.
సిబ్బంది కొరత – నిర్లక్ష్యపు వైఖరి..
ఆజంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం ఆరుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మెడికల్ ఆఫీసర్, ఒకరు ఆయుష్ డాక్టర్, ఒకరు ఫార్మసిస్ట్, ఎన్డిసి స్టాఫ్ నర్సు ఇతర సిబ్బంది ఉన్నారు. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్‌కు రెగ్యులర్ ఉద్యోగం రావడంతో వారు వెళ్లిపోయారు. ఆ స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం పది గంటల తర్వాత మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారని, సాయంత్రం ఐదు దాటితే ఆసుపత్రిలో ఎవరూ ఉండరని వారు చెబుతున్నారు. అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 30 కిలోమీటర్ల దూరంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి ( 100 పడకల) కి వెళ్లాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరసనగా ఆసుపత్రికి తాళాలు..
వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా రోగులతో కలిసి గ్రామస్తులు ఆసుపత్రికి తాళాలు వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు పేరుకే ఆసుపత్రి ఇక్కడ ఉందిగానీ సకాలంలో సేవలు అందక వైద్యం అందని ద్రాక్షలా మారిందని, ప్రస్తుతం దుర్గటన జరిగిన కూడా ఆస్పత్రికి వస్తె సరైన సిబ్బంది లేరని, ఉన్న సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని , ఉపాధ్యాయులకు సకాలంలో వైద్యం అందించడం పోవడంతో నిరసనగా ఆసుపత్రికి తాళాలు వేశామని గ్రామస్థులు తెలిపారు. జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి ఆస్పత్రిలో సిబ్బంది నియమించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ఆరోగ్య సేవలపై ప్రశ్నార్థకం…
ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల పర్యవేక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అత్యవసర సమయాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందనీ మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గాయపడిన ఉపాధ్యాయుడి వేదన
ఆజంనగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. రోజులాగే ఈరోజు కూడా ఆటోలో పాఠశాలకు వెళ్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. గాయాలతో ఆసుపత్రికి వెళ్తే అక్కడ కొంత మంది సిబ్బంది ఉన్నారు కానీ స్టిచింగ్ మెటీరియల్ లేదు. నాకు ఒక్కడికే ప్రథమ చికిత్స అందించారు. కానీ మా సహచర ఉపాధ్యాయుడు కే .రాజుకు, మిగతా ఉపాధ్యాయులకు వైద్యం చేయమంటే నా డ్యూటీ టైమ్ అయింది. వేరే వాళ్ళు వచ్చి వైద్యం చేస్తారని సిబ్బంది చెప్పారు . వెళితే చివరకు క్షత గాత్రులు అందరూ 100 పడకల ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చిందని తెలిపారు.
దుర్ఘటనపై గ్రామ సర్పంచ్ మహేష్ ఆగ్రహం
ఆజాంనగర్ గ్రామ సర్పంచ్ సోమిశెట్టి మహేష్ మాట్లాడుతూ ఆజంనగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు సరైన వైద్యం ఎప్పుడూ అందడం లేదు. సిబ్బంది సమయపాలన పాటించరు. రోగులతో, వృద్ధులతో దురుసుగా మాట్లాడటం అలవాటుగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని విమర్శించారు.

