- బిక్కనూరు ఆర్‌టీఏ చెక్‌పోస్టుపై తనిఖీలు
- ఏసీబీ అదుపులో ఏఎంవీఐ
- ప్రైవేట్ వ్యక్తులను పట్టుకున్న అధికారులు
- మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు
బిక్కనూరు, మహబూబాబాద్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా ఆర్‌టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు (ACB officials) బుధవారం దాడులు నిర్వహించారు. అలాగే మహబూబాబాద్ (Mahabubabad) ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. అంతరాష్ట్ర వాహనాలను తనిఖీ చేయు నిమిత్తం ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్టు (Check post) లో ప్రైవేటు వ్యక్తుల దందా కొనసాగుతోందని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఆర్‌టీఏ అధికారులు (RTA officials) డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నిఘా వేసి దాడులు చేశారు.
ఏసీబీ అదుపులో ఏఎంఐవీ, కానిస్టేబుల్
చెక్‌పోస్టుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు తొలుత లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులను పట్టుకున్నారు.అనంతరం వారి నుంచి వివరాలు తెలుసుకున్న అధికారులు డ్యూటీ లో ఉన్న అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (Assistant Motor Vehicle Inspector) (ఏఎంవీఐ)తో పాటు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకూ రికార్డులు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏసీబీ తనిఖీలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏసీబీ అధికారులు అకస్మాకంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో పలు రికార్డులను స్వాధీనపరచుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యగా అనుగుణంగా స్టాక్ రిజిస్టర్ ఇష్యూ, ఆన్లైన్ అటెండెన్స్, ఆహార పదార్థాల నిల్వలో భారీగా తేడాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ , లీగల్ మెట్రాలజీ అధికారుల సహాయంతో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
