అద్భుత ఫామ్‌తో అద‌ర‌గొడుతున్న అభిషేక్

భారత క్రికెట్‌లో యువ సంచలనం, దూకుడు గల బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. సెప్టెంబర్ నెలకు గాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును అందుకున్నారు.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రైన్ బెన్నెట్‌లతో పోటీ ప‌డి ఈ అవార్డును గెలుచుకున్నాడు.

ఆసియా కప్ మొత్తం అభిషేక్ శర్మ తన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 7 మ్యాచ్‌లలో, 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి రన్ స్కోరర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో అతను మూడు అర్ధశతకాలు నమోదు చేశాడు.

ముఖ్యంగా, పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో, కేవలం 39 బంతుల్లో 74 పరుగులు చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అత్యద్భుత ఫామ్ కారణంగా, అభిషేక్ ‘ఆసియా కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకున్నారు.

ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ పై అభిషేక్ స్పందన..

ఈ ఘనతపై సంతోషం వ్యక్తం చేసిన అభిషేక్ శర్మ, “ఈ ఐసీసీ అవార్డు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడం గర్వంగా ఉంది. జట్టు మేనేజ్‌మెంట్, సహచర ఆటగాళ్లు, ఈ అవార్డును అందించిన ప్యానెల్‌కి నా ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.

తన దూకుడు బ్యాటింగ్‌తో అభిషేక్ శర్మ, 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో ఒక కీలక ‘పవర్‌హిట్టర్’గా ఎదుగుతున్నాడు. అతని ఈ ఫామ్ టీమిండియాకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది.

Leave a Reply