యెస్…మీరు చూసింది కరెక్టే… పెళ్ళంటే నూరేళ్ళ పంట… అనే మాట పాతబడిపోయింది. వివాహబంధానికి గ్యారెంటీ లేకుండా పోయింది… లవ్వుకి బ్రేకప్… దాంపత్యానికి డివోర్స్…టకాటక్…ఫాస్ట్ ట్రాక్ యుగం కదా. అయితే అలా అభిప్రాయ బేధాలో, మరే కారణాలతో విడిపోవడం, మరో బంధానికి తెరతీయడం జీవన పరిణామ క్రమమే. మనం తప్పుబట్టలేం. కానీ, ఒకేవ్యక్తి వరుసగా ఒక్కొక్కర్ని పెళ్ళాడుతూ…వారిని మోసం చేసి ఉడాయిస్తూ మరోచోట మరో పేరుతో ప్రత్యక్షమై మళ్ళీ మరొకరికి వలపుల వల విసురుతూ… అదేపనిగా పెళ్ళిళ్ళ పేరుతో నయవంచన చేస్తూంటే..
ఇటీవల మహారాష్ట్రలో ఇలాగే జరిగింది. ఓ మహిళ డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది. డబ్బుల కోసం ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంది. ఆ ఎనిమిది మంది దగ్గరి నుంచి లక్షలు దోచేసి పరారైంది. 9వ పెళ్లి చేసుకోవడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగ్‌పూర్‌కు చెందిన సమీరా ఫాతిమా (sameera fathima) బాగా చదువుకుంది. టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఏం పాడు బుద్ధి పుట్టిందో ఏమో తెలీదు కానీ.. ఓ గ్యాంగ్‌తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింలను పెళ్లి చేసుకుని మోసం చేయటం మొదలెట్టింది. 15ఏళ్లనుంచి మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్‌తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు(matrimonial websites), ఫేస్‌బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులు అయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది.
పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్..
వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ (blackmail) చేసి.. పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బులు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యేది. సమీరా ఓ భర్త నుంచి ఏకంగా 50లక్షల రూపాయలు.. మరో భర్త నుంచి 15లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది.
పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8మందిని విజయవంతంగా మోసం చేసింది. 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే, ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జులై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీషాపులో ఉన్న సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు జైలు పాలైంది.