పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గిరి మహిళ

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆధునికత వైపు ప్రపంచం పయనిస్తున్నా.. ఏజెన్సీ గ్రామాల్లో సౌకర్యాలు లేక రోడ్ మీద ప్రసవాలు జరుగుతున్న సంఘటనలు కోకొల్లాలు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ (Komaram Bheem Asifabad) జిల్లాలో పురిటి నొప్పులతో ఉన్న గిరిజన మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. సవాతిగూడకి చెందిన సీడాం మార్కుబాయికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ‘108’ కి ఫోన్ చేశారు. అయితే, ఆ గ్రామానికి సరైన రోడ్డు, వంతెన లేకపోవడంతో అంబులెన్సు వాగు దాటి రాలేకపోయింది.

దీంతో వాహన సిబ్బంది సుమారు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి వెళ్లారు. నొప్పులతో బాధపడుతున్న మార్కుబాయిని కాలినడకన అంబులెన్సు (Ambulance) వద్దకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు నొప్పులు ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు, 108 సిబ్బంది సాయంతో మార్గమధ్యంలోనే మట్టి రోడ్డుపై ప్రసవించింది. రోడ్లు, వంతెనలు లేకపోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక గిరిజనులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

Leave a Reply