- లక్ష్మీపూర్‌లోనే అందరి అడ్డా!
- **టెన్షన్ టెన్షన్… **
- ఓటర్లు ఎవరిని ఎన్నకుంటారో?
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామపంచాయతీల్లో ఒకటైన కన్నాలలో ఈసారి ఎన్నికల హీట్ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామంలో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి తలపడటంతో రేసు కఠినతరం అయింది.
గ్రామపంచాయతీలో మొత్తం 928 మంది ఓటర్లు, 8 వార్డులు ఉండగా… ఒక్క లక్ష్మీపూర్‌లోనే 400 పైచిలుకు ఓట్లు ఉండటంతో అభ్యర్థుల దృష్టంతా అక్కడికే చేరింది. సర్పంచ్ గెలుపు తీర్పు లక్ష్మీపూర్ ఓటర్ల చేతుల్లోనే ఉందని భావిస్తూ ముగ్గురు అభ్యర్థులు అక్కడే ప్రచారానికి అడ్డా వేసుకున్నారు.
ముగ్గురు బలమైన అభ్యర్థులు…
కాంగ్రెస్ బలపరుస్తున్న నాతరి మల్లమ్మ… కన్నాల ఎస్సీ కాలనీకి చెందిన ఈమెకు ఆ కాలనీలో 120 పైచిలుకు ఓట్లు బలం అందిస్తున్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి జిల్లపల్లి వెంకటస్వామికి పార్టీ బలం ఉన్నా, రెబల్ అభ్యర్థి ఉండటం ఆయనకు అడ్డంకిగా మారింది.
బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గోగర్ల రాజేశం నిశ్శబ్దంగా, చాపకింద నీరులా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ప్రచారం గ్రామంలో చర్చనీయాంశమైంది.


ఎందుకీ లక్ష్మీపూర్కే అంత ప్రాధాన్యం?
కన్నాలలో మొత్తం ఓటర్లలో దాదాపు సగం ఓట్లు లక్ష్మీపూర్‌లో ఉండటంతో, సర్పంచ్ కుర్చీ ఏ దిశకు వాలుతుందో అక్కడి ఓటర్లే నిర్ణయిస్తారు. అందుకే ముగ్గురు అభ్యర్థులు టెంట్లు వేయడం, భోజన వసతులు ఏర్పాటు చేయడం, ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం లక్ష్మీపూర్కే కేంద్రీకరించారు. ఈ గ్రామం పూర్తిగా ప్రచార కేంద్రంగా మారిపోయింది.
సైలెంట్ ప్రచారమే రేసుకు కిక్!
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బహిరంగ కార్యక్రమాలు చేస్తుండగా… రెబల్ అభ్యర్థి రాజేశం మాత్రం నిశ్శబ్ద ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. “ఓటు బ్యాంకు ఎటు మొగ్గుతుందో అంచనా వేయడం కష్టమే” అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎస్సీ కాలనీ – కన్నాలలో ఓటర్ క్యాలిక్యులేషన్
కన్నాల ఎస్సీ కాలనీ: 120 పైగా ఓట్లు
కన్నాల ప్రధాన గ్రామం: 250 పైగా ఓట్లు
ఈ రెండు ప్రాంతాల్లో కూడా గుత్తాధిపత్యం కోసం అభ్యర్థుల పోటీ సాగుతోంది. అయితే లక్ష్మీపూర్‌లోని భారీ ఓటరు సంఖ్యే తుది ఫలితానికి కీలకం కానుంది. “కన్నాలలో సర్పంచ్ ఎవరు అన్నది లక్ష్మీపూర్ ఓటర్లే నిర్ణయిస్తారు. అందుకే ముగ్గురూ అక్కడే మకాం వేశారు” అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

