Jaggaiahpet | సహకార శక్తితో గ్రామీణాభివృద్ధికి బలమైన అడుగు..

Jaggaiahpet | సహకార శక్తితో గ్రామీణాభివృద్ధికి బలమైన అడుగు..
- జగ్గయ్యపేటలో రూ.3.90 కోట్ల కేడీసీసీ రుణాల పంపిణీ
- సగం రుణాలు డ్వాక్రా సంఘాలకు
- మహిళా సాధికారతకు పెద్దపీట
Jaggaiahpet | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కృష్ణ రైతుల సహకార సంఘంలో కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్థిక సహకారంతో బండిపాలెం, గౌరవరం, పోచంపల్లి, మంగోలు, గోపాలకృష్ణ సహకార సంఘాల పరిధిలోని డ్వాక్రా మహిళా సంఘాలు మరియు రైతులకు రైతు నేస్తం – కర్షక మిత్ర రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం రూ.3.90 కోట్ల విలువైన రుణాలు లబ్ధిదారులకు అందజేయగా, అందులో సగం రుణాలు డ్వాక్రా మహిళా సంఘాలకు మంజూరు చేయడం విశేషం. మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు రుణాల చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధే కేడీసీసీ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని, సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్నామని తెలిపారు. తక్కువ వడ్డీ రేట్లు, సులభ నిబంధనలతో సమయానుకూల రుణాలు అందిస్తూ రైతుల సాగు వ్యయభారం తగ్గిస్తున్నామని చెప్పారు. శాసనసభ్యుడు తాతయ్య మాట్లాడుతూ, రైతు మరియు మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ సమాజం సుసంపన్నంగా మారుతుందని అన్నారు. కేడీసీసీ బ్యాంక్ ద్వారా అందుతున్న రుణాలు స్వయం ఉపాధి అవకాశాలు పెంచి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల సీతమ్మ మాట్లాడుతూ, నెట్టెం రఘురాం నాయకత్వంలో కృష్ణ జిల్లా కేడీసీసీ బ్యాంక్ సహకార రంగానికి కొత్త ఊపునిచ్చిందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబాలకు ఆదాయ వనరులు సృష్టించుకోవడంలో ఈ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గౌరవరం సహకార సంఘం అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు మాట్లాడుతూ, రైతులు మరియు డ్వాక్రా మహిళలకు సమయానుకూల రుణాలు అందించడం అభినందనీయమని తెలిపారు. పోచంపల్లి సహకార సంఘం అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సహకార వ్యవస్థ బలపడితేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని అన్నారు.

కృష్ణ సహకార సంఘం అధ్యక్షుడు యానాల గోపీచంద్ మాట్లాడుతూ, తక్కువ వడ్డీ రుణాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని, మహిళా సంఘాలకు సగం రుణాలు మంజూరు చేయడం శ్లాఘనీయమని పేర్కొన్నారు. మంగోలు సహకార సంఘం అధ్యక్షుడు బొల్లం పురుషోత్తం మాట్లాడుతూ, రైతు నేస్తం పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. గోపాలకృష్ణ సహకార సంఘం అధ్యక్షుడు ధూళిపాళ లక్ష్మణరావు మాట్లాడుతూ, సహకార బ్యాంకింగ్ సేవలు గ్రామీణాభివృద్ధికి బలంగా నిలుస్తున్నాయని అన్నారు.
బండిపాలెం సహకార సంఘం అధ్యక్షుడు బొల్లినేని అప్పారావు మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ రైతు పక్షపాతిగా నిలుస్తోందని అభినందించారు. కౌన్సిలర్ గీతారాణి మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ ద్వారా డ్వాక్రా మహిళలకు అందుతున్న రుణాలు కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు, వివిధ సహకార సంఘాల అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు కేడీసీసీ బ్యాంక్‌కు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రుణాలు తమ ఆర్థికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆనందం వ్యక్తం చేశారు.
