నర్సింహులపేట, మార్చి12(ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట మండల కేంద్రం శివారు ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన శ్రీ పద్మావతి, అలివేలుమంగ సమేత చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం ఘనంగా ఉన్నా కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని, భక్తుల కొంగు బంగారమై పేరుగాంచిన ఆలయాన్ని నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల కంటే వైభవోపేతంగా నడిచిన ఇంద్రకీలాద్రిపై నేడు చిన్నచూపు చూస్తున్నారని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రజలు ఆరోపిస్తూ పలువురు విమర్శిస్తున్నారు. నేటి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను సమకూర్చామని ఆలయ కార్యనిర్వాహణాధికారి కే వేణుగోపాల్ తెలిపారు.
ఆలయ చరిత్ర..
ఇంద్రకీలాద్రి పర్వతంపై శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలవై ఉన్నారని స్థానికులు 1368లోనే స్థానికులు గుర్తించారు. నాడే ముందు నిలిచి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు వారాంతపు జాతర జరుగుతుండడంతో బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. హోలీ పౌర్ణమి రోజున స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. భక్తుల విశ్వాసంతో రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలకు వీరి సంఖ్య వేళల్లో ఉంటుంది.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇలా..
నేటి నుండి సేవా కాలం కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. 13న గురువారం బిందెతీర్థం, తీర్థప్రసాద గోష్టి, 14న శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, సాయంత్రం నాలుగు గంటల నుండి బేరి పూజ, దేవత ఆహ్వానం, హోమం బలిహరణం, రాత్రి 8 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. 15న శనివారం ఉదయం బలిహరణం, పురవీధి సేవ, తీర్థ ప్రసాద గోష్టి ఉంటుంది. 16న ఆదివారం పూర్ణాహుతి, చక్రతీర్థం పుష్పయాగం, ఏకాంత సేవ ఉత్సవ పరిసమాప్తి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వేణుగోపాల్ తెలిపారు.
