India 1st Glass Bridge | కైలాస గిరికి కొత్త శోభ

-ఘనంగా గ్లాస్ బ్రిడ్డి షురూ
-ఇది భారత్ లోనే అతిపెద్ద క్యాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జి
India 1st Glass Bridge | ఆంధ్రప్రభ, ఆరిలోవ (విశాఖపట్నం) : పర్యాటకపరంగా శర వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరం సందర్శకులను ఆకర్షించేందుకు సరికొత్త హంగులతో సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా కైలాసగిరి (Kailasagiri) కొండపై నూతనంగా ఏర్పాటు చేసిన 50 మీటర్లు పొడవు కలిగిన క్యాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ ను విశాఖ ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, పిఎంఆర్డిఏ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్ తదితరుల చేతుల మీదుగా సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖను పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

అందమైన విశాఖలో కైలాసగిరి ప్రాంతం సందర్శకులకు ఎంతో కనువిందు చేసే ముఖ్యమైన ప్రదేశమని, ఈ కైలాసగిరి అందాలను రెట్టింపు చేసేలా సుమారు ఏడు కోట్ల రూపాయలతో సముద్రమట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందన్నారు. గాలిలో తేలియాడే అనుభూతినిచ్చే ఈ గ్లాస్ బ్రిడ్జి నుంచి చూస్తే విశాఖ సాగర తీర అందాలు అందరినీ మైమరిపిస్తాయని వ్యాఖ్యానించారు. మరో కొన్ని రోజుల్లో ఎత్తయిన త్రిశూల డమరుక ఆధ్యాత్మిక నిర్మాణ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తామని విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు. విశాఖ పర్యాటక ప్రాంతానికి వన్నె తెచ్చే గ్లాస్ బ్రిడ్జి (Glass Bridge) ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిస్తుందని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు.


