ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: చిలీ (Chile) దేశానికి సమీపంలో డ్రీక్ పాసేజ్‌లో (Drake Passage) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆగస్టు 21న రాత్రి 9:16 (అక్కడి కాలమానం ప్రకారం) సమయంలో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అంతేకాదు, ఈ భూకంపం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో భాగంగా సంభవించిందని, భూకంప కేంద్రం 10.8 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC) చిలీకి సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ భూకంపం కారణంగా చిలీ తీర ప్రాంతాల్లో ప్రమాదకర సునామీ అలలు రావచ్చని హెచ్చరించింది. ఇక చిలీ నావల్ హైడ్రోగ్రాఫిక్ అండ్ ఓషనోగ్రాఫిక్ సర్వీస్ (SHOA) చిలీకి చెందిన అంటార్కిటిక్ ప్రాంతానికి ప్రత్యేకంగా సునామీ హెచ్చరిక జారీ చేసింది. అలాగే, ప్రజలు తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేసి, సురక్షిత ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.కాగా, జులై 30న రష్యా తీరంలోని కమ్చాట్కా వద్ద 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి, పసిఫిక్ మహా సముద్రంలో అసాధారణ అలలను సృష్టించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంగా జపాన్, హవాయి, అమెరికా తీర ప్రాంతాల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల్లోనే మరోసారి ఈ భారీ భూకంపం సంభవించింది.