చైన్ స్నాచింగ్ కేసు లో ట్విస్ట్

చైన్ స్నాచింగ్ కేసు లో ట్విస్ట్

నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి
అరెస్ట్ బంగారం, బైక్ స్వాధీనం
తిరువూరు, మండలం చిక్కుళ్ళగూడెంలో వృద్ధురాలిపై దాడి..

తిరువూరు,ఆంధ్రప్రభః తిరువూరు మండలం చిక్కుళ్ళగూడెం గ్రామంలో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండటం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన వృద్ధురాలు ఉప్పు అనసూర్య మెడలో ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు నాంతాడు చైన్‌ను దుండగుడు అపహరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు.


నిందితుడు విజయవాడకు చెందిన నంద సుభాష్‌గా తేలింది. ఇతను అసిస్టెంట్ లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఉద్యోగంలో ఉన్నప్పటికీ చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనానికి ఉపయోగించిన బైక్‌ను గానుగపాడు గ్రామంలో దొంగిలించినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు నిందితుడిని లక్ష్మీపురం శివారులో అరెస్టు చేసి, అతని వద్ద నుంచి బంగారు చైన్‌తో పాటు బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సీఐ కే. గిరిబాబు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు, ఐడి పార్టీ కానిస్టేబుల్ షేక్ ఖాసిం పాల్గొన్నారు.

Leave a Reply