వరంగల్: బ్యాంకు వారి వేధింపులు తాళలేక కుటుంబం మెుత్తం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ నగరానికి చెందిన చిలుకూరి బ్రదర్స్.. చిలుకూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్ పేరిట దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపార, కుటుంబ అవసరాల నిమిత్తం ఓ బ్యాంకు నుంచి అప్పుగా కొంత నగదు తీసుకున్నారు. వ్యాపారం నష్టాల్లో కూరుకుపోవడంతో బ్యాంకుకు వాయిదాలు చెల్లించడం ఇబ్బందిగా మారింది.
దీంతో బ్యాంకు ఏజెంట్లు చిలుకూరి బ్రదర్స్ ఇల్లు, దుకాణం వద్దకు వస్తూ వారిని వేధించడం మెుదలుపెట్టారు. అందరి ముందే అవమానిస్తూ కించపరిచారు. ప్రతిరోజూ ఇబ్బందులు పెడుతూ వేధించారు ఏజెంట్లు. వారి వేధింపులు తాళలేక సదరు కుటుంబసభ్యులు మెుత్తం వరంగల్ చౌరస్తాలో ఆత్మహత్యాయత్నం చేశారు. అంతా కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు.
అయితే అక్కడ ఉన్న స్థానికులు బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అనంతరం 108కి సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించిన వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.