TTD | 35 ఏళ్ల సర్వీస్ లో సేవింగ్స్ శ్రీవారికి విరాళం !
తిరుమల శ్రీవారికి సోమవారం భారీ విరాళం అందింది. ఏడుకొండల్లో కొలువుదీరిన వెంకన్నకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు కూడా టీటీడీలోని ట్రస్ట్‌లు, పథకాలకు విరాళాలు అందిస్తారు. అయితే సోమవారం శ్రీవారికి లభించిన విరాళం చాలా అరుదుగా మారింది.
రేణిగుంటకు చెందిన మోహన భక్తురాలు.. తన జీవితంలో ఆదా చేసిన ప్రతి పైసాను వెంకన్నకు కానుకగా సమర్పించారు. భారత్ సహా పలు దేశాల్లో విపత్తు నిర్వహణ అధికారిగా వివిధ దేశాల్లో పనిచేసిన మోహన… తన 35 ఏళ్ల సర్వీసులో ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీ శ్రీవేంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్టుకు విరాళంగా అందించారు.
ఆ మొత్తాన్ని డీడీ రూపంలో తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరికి అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని వెంకయ్య చౌదరి కొనియాడారు. మూడున్నర దశాబ్దాలకుపైగా తన వృత్తి జీవితంలో సంపాదించిన ధనాన్ని, గోవిందుడి కృపతో అనాథలు, పేదలకు ఉపయోగపడాలనే ఆమె నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమం కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.