ప్రధాని పర్యటన సమగ్ర షెడ్యూల్‌..

ప్రధాని పర్యటన సమగ్ర షెడ్యూల్‌ ..

కర్నూలు బ్యూరో, అక్టోబర్‌ 11 (ఆంధ్రప్రభ): ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 16న కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు, ప్రజా సమ్మేళనంలో పాల్గొనేందుకు రానున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్‌ బృందాలు ఇప్పటికే కర్నూలు, ఓర్వకలు, సునిపెంట, శ్రీశైలం ప్రాంతాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశాయి.

ప్రధాని మోదీ ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, ఉదయం 10.20 గంటలకు ఓర్వకలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సునిపెంట వైపు ప్రయాణిస్తారు.

సునిపెంట హెలిప్యాడ్ (Sunipenta Helipad) వద్ద ప్రధాని హెలికాప్టర్‌ ఉదయం 11.10 గంటలకు ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉంది. అనంతరం ఆయన రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి, ఉదయం 11.45 గంటలకు శ్రీశైలం దేవస్థానంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దర్శనం చేసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు సునిపెంటకు తిరిగి వచ్చి, హెలికాప్టర్‌ ద్వారా కర్నూలు పరిధిలోని నన్నూరు గ్రామ సమీపంలోని ప్రజా సభ స్థలానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు రాగం మయూరి రిసోర్స్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ప్రధానమంత్రి ప్రజా సభ (Prajasabha) లో పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర పథకాల అమలు, ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని తన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది. తరువాత ప్రధాని సాయంత్రం 4.00 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ఓర్వకలు ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

ఈ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులు కర్నూలులో శిబిరం వేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి బృందాలు ప్రతి నిమిషానికి సమీక్ష నిర్వహిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

16న ఉదయం 7.50 కు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని.
*ఉదయం 10.20 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ.

*ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు చేరుకోనున్న ప్రధాని.

*ఉదయం 11.45 కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ.

*మధ్యాహ్నం 1.40 కి సుండిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ.

*మధ్యాహ్నం 2.30 కు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన.

*సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ.

*సాయంత్రం 4.15 కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకొని సాయంత్రం 4.40 కు ప్రధాని మోడీ కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని దిల్లీకి వెళ్లనున్నారు.

Leave a Reply