- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాడి శ్వేత
BC | గిద్దలూరు ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత డిమాండ్ చేశారు. శనివారం గిద్దలూరు లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇదే అంశంపై సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు బీసీ జనగణన- వర్గీకరణలు జరపకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడమేనంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పంచాయతీరాజ్- పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిందన్నారు.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్-జస్టిస్ చల్లా గుణరంజన్ లతో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసిందన్నారు. తమ తరపు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ ప్రతిసారి ఎన్నికల సమయం వచ్చేవరకు జనగణనలో బీసీల కుల గణనను చేయకపోవడంతో,వేలాది పదవులను బీసీలు కోల్పోయేలా తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదించారన్నారు.
అలాగే బీసీ కులాలలోని అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం దక్కాలంటే విద్యా, ఉద్యోగాలలో ఏ విధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగిందో, అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా వర్గీకరించి మాత్రమే అమలు జరపాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగియుటకు 6 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించుకునే వేసులుబాటు ఉన్నందున మొత్తం ప్రక్రియను 2026 ఏప్రిల్ కు పూర్తి చేసి, చట్టబద్ధ బీసీ రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్నందున, కేంద్రంతో సంప్రదించి సదరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించి, బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు బీసీ మహిళా నాయకులు పాల్గొన్నారు.

