ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) వద్ద ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుషినగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22537)లోని AC కోచ్ B2 బాత్రూమ్‌లో, సుమారు 7-8 సంవత్సరాల వయసున్న చిన్నారి మృతదేహం లభ్యమైంది. నాసిక్ నుంచి ముంబైకి వచ్చిన రైలులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాత్రూమ్ లోని డస్ట్ బిన్ లో మృతదేహాన్ని చూసిన రైల్వే సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది నుండి సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక కుటుంబం గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తుందని.. బాలిక అదృశ్యమైన తర్వాత ఆ కుటుంబం ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసులు గుర్తించారు.
రైలులోనే హత్య చేసి వదిలేశారా?
సూరత్‌లో ఒక దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసి నాసిక్‌కు తీసుకెళ్లాడని, అక్కడి నుంచి ముంబైకి రైలు ఎక్కి, రైలులో హత్య చేసి, మృతదేహాన్ని బాత్రూమ్ చెత్తబుట్టలో పడేశాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అలాగే, కుటుంబం చెప్పిన అనుమానాల ప్రకారం బంధువులకూ ఈ ఘటనకు సంబంధం ఉండవచ్చని పోలీసులు ఆరాతీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా, కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.
