Minister | అప్పుడు రోడ్లన్నీ అధ్వాన్నం

Minister | అప్పుడు రోడ్లన్నీ అధ్వాన్నం
- ఇప్పుడు అభివృద్ధి పరుగులు
- మినీ బైపాస్ రోడ్డు శంకుస్థాపనలో
- మంత్రి జనార్థన రెడ్డి స్పష్టం
Minister | ఏలూరు,ఆంధ్ర ప్రభ బ్యూరో : గత 9 నెలల కాలంలో ₹ 1021 కోట్లతో 26 వేల కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధనరెడ్డి చెప్పారు. ఏలూరులో ₹2.60 కోట్లతో చేపట్టనున్న గూడ్స్ షెడ్ నుంచి ఆశ్రమ ఆసుపత్రి వరకు మినీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శనివారం రాత్రి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రంగాలకు కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే రోడ్ల అభివృద్ధి తప్పనిసరన్నారు. గత ప్రభుత్వం రోడ్లను అస్సలు పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని, అద్వాన్న పరిస్థితిలో ఉన్న రోడ్లకు కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం పోసిందన్నారు.

యువనాయకుడు నారా లోకేష్ కు పాదయాత్ర సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు విజ్ఞప్తి చేసారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్ల పరిస్థితిని మారుస్తానని లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఇచ్చిన భారీ గెలుపును బాధ్యతగా భావించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలలలో గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిందన్నారు.
రహదారులు, భవనాల శాఖ ద్వారా ప్రతీ జిల్లాలోనూ రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు, బ్రిడ్జ్ లకు మరమ్మత్తులు చేయించామన్నారు. ఏలూరు నగరంలో రోడ్ల అభివృద్ధికి 22.5 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ముందుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మంత్రి జనార్దనరెడ్డికి పూల బుకే ని అందించి స్వాగతం పలికారు.

ఏలూరులో ప్రస్తుతం మంజూరు చేయవలసిన రోడ్ల వివరాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని కూడా మంజూరు చేస్తానని మంత్రి ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు కో-అప్క్షన్ మెంబెర్స్ ఎస్ఎం ఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, రహదారులు భవనాల శాఖ స్టేట్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ ఎల్. శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ కె. విజయరత్నం, ఈఈ వై.వి. కిషోర్ బాబూజీ, ఏఈ శేషు కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.
