TG | ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

TG | ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

  • డీఎంహెచ్‌వో
  • ప్రభుత్వ ఆసుపత్రిలోనే బర్త్ ప్లానింగ్
  • డా. ప్రమోద్ కుమార్

TG | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన ప్రణాళికతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కె.ప్రమోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ‌ రామగుండంలోని సిమ్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య అధికారులు, సూపర్ వైజర్లు, ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతులతో కన్వర్జెన్సీ సమావేశం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా డా.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ….. క్షేత్రస్థాయిలో నెలలు నిండిన గర్భిణీలను నిరంతరం ట్రాకింగ్ చేయాలని, బర్త్ ప్లానింగ్ మొత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండంలోనే జరిగేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రసవాలు నిర్వహించడంలో నిష్ణాతులైన గైనకాలజిస్టులు, నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. అలాగే ఉచితంగా టిఫ్ఫా స్కానింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ పరిధిలోని గర్భిణీలను ప్రసవాల కోసం తప్పనిసరిగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండానికి తీసుకురావాలని ఆదేశించారు.

TG

అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌లో నెలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. మెడికల్ ఆఫీసర్లు వారానికి కనీసం 20 కేసులు, ఎంఎల్‌హెచ్‌పీలు వారానికి 50 కేసులు క్రాస్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. ప్రతి మధుమేహం, రక్తపోటు కేసును ఎన్‌సీడీ పోర్టల్‌లో వైద్య అధికారి లాగిన్ ద్వారా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి క్యాన్సర్ కేసును తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని, రిఫరల్ కేసులను మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని తెలిపారు. రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ కీమోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

వందశాతం వ్యాక్సినేషన్ సాధించడంతో పాటు డ్రాప్‌అవుట్ కేసులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓపీ సంఖ్యను పెంచాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా.రాజమౌళి, డా.వి. వాణిశ్రీ, డా.బి.శ్రీరాములు, డా.బి.కిరణ్, డా.అరుణ (ఓబీజీవై ప్రొఫెసర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్), డా.శ్రీదేవి (ఓబీజీవై ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడీ ), పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సూప‌ర్ వైజర్లు, ఏఎన్‌ఎంలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply