Bandi Sanjay Kumar | సంస్కారం.. క్రమశిక్షణ, దేశభక్తి ముఖ్యం..

Bandi Sanjay Kumar | సంస్కారం.. క్రమశిక్షణ, దేశభక్తి ముఖ్యం..
- దేశ భవిష్యత్తును నిర్మించేది శిశు మందిర్
- నవ భారతాన్ని నిర్మించే శిల్పులు ఇక్కడే..
- పక్కా భవనాల నిర్మాణానికి కృషి చేస్తా..
- పాలకుల నిర్లక్ష్యంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Bandi Sanjay Kumar | కరీంనగర్, ఆంధ్రప్రభ : ప్రతీ విద్యార్థికి సంస్కారం.. క్రమశిక్షణ.. దేశభక్తి ఎంతో ముఖ్యమని, దేశ భవిష్యత్తును నిర్మించేది సరస్వతీ శిశు మందిర్ విద్యాలయాలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో రెండు రోజులపాటు నిర్వహించే ఆటల పోటీలు- ఖేల్ ఖుద్ ప్రారంభ కార్యక్రమానికి బండి సంజయ్ విచ్చేశారు. అఖండ జ్యోతి వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు.
అనంతరం మాట్లాడుతూ… దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని అన్నారు. నవ భారత నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశుమందిర్ గురువులని కొనియాడారు. ఇంత గొప్ప స్కూల్లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు శిశు మందిర్ లోనే నేర్చుకున్నానని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతో పాటు ల్యాప్ టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మానవీయ విలువలను పెంపొదిస్తూ దేశ భవిష్యత్ కోసం నవతరాన్ని తయారు చేయడంలో సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. శిశుమందిర్ లో చదువుకున్న ఎంతో మంది అధికారులు అయ్యారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగులయ్యారని, రాజకీయ నేతలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. తాను కూడా శిశు మందిర్ లో చదువుకోవడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాక డబ్బు సంపాదనలో పడి విద్య అనే పదాన్ని పూర్తిగా మార్చేశాయని, చదువు అంటే ర్యాంకులు, మార్కులు, ప్యాకేజీలు, ఫారిన్ కోసమే అన్నట్లుగా తయారైందన్నారు. శిశు మందిర్ వ్యాపారం చేయదని, సరస్వతి శిశుమందిర్ అంటే ప్రభుత్వ పాఠశాల కాదని బండి సంజయ్ అన్నారు.
