Water Problem | మున్సిపాలిటీలకు తాగునీటి భరోసా..

Water Problem | మున్సిపాలిటీలకు తాగునీటి భరోసా..

  • ప్రతిపాదనలు సిద్ధం… టెండర్ల దశలో నీటి పథకాలు..
  • నళ్లాల్లో నీరు లక్ష్యంగా, పట్టణాలలో నీటి సరఫరా..
  • ప్రతి ఇంటికి 135 లీటర్ల నీరు లక్ష్యంగా చర్యలు..

Water Problem | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలలో నీటి (Water) సరఫరా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మొత్తం 128 కోట్ల రూపాయలతో పనులకు మంజూరు లభించటం పట్టణ ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవ్వగా, టెండర్ల ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే దిశగా చర్యలు సాగుతుండటంతో త్వరలోనే తాగునీటి సమస్యను తీర్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి.

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో జనాభా (population) పెరుగుదలతో పాటు నీటి అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకు భూగర్భ జలాలు, రిజర్వాయర్లు, బోరు బావులపై ఆధారపడి కొనసాగుతున్న నీటి సరఫరాను మరింత పటిష్టంగా మార్చేందుకు అమృత్ రెండు పథకం కింద ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. నగరంలోని ప్రధాన నీటి పైపుల సరఫరా వ్యవస్థను ఆధునీకరించడానికి 29.70 కోట్ల రూపాయలు, బలహీన వర్గాల కాలనీల్లో తాగునీటి సౌకర్యాలను విస్తరించడానికి 34.43 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులు అమలులోకి వస్తే.. లీకేజీలు తగ్గి, నీటి వృథా నివారించబడటంతో పాటు సరఫరా సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.

Water Problem

కుప్పం మున్సిపాలిటీలో భౌగోళిక పరిస్థితులు, తక్కువ వర్షపాతం కారణంగా తాగునీటి సమస్య (Water Problem) కొంతకాలంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇక్కడ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది. నీటి సరఫరా మెరుగుదలకు 9.21 కోట్ల రూపాయలు, బలహీన వర్గాల కాలనీల్లో నీటి సౌకర్యాల కోసం 6.74 కోట్ల రూపాయలతో పనులు మంజూరయ్యాయి. అమృత్ పథకం కింద ప్రతిపాదించిన కొత్త నీటి ప్లాంట్‌తో పాటు ఈ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకాలు పూర్తి అయితే.. కుప్పం పట్టణంలో నీటి భద్రత మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది.

పుంగనూరు మున్సిపాలిటీలో కూడా తాగునీటి సరఫరాను మెరుగుపరచేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం బోరు బావులు, చెరువుల పై ఆధారపడి కొనసాగుతున్న సరఫరాను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బలహీన వర్గాల కాలనీల్లో (Colonys) నీటి సరఫరా మెరుగుదలకు 2.53 కోట్ల రూపాయలు, పైపుల విస్తరణకు 11.82 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అమృత్ రెండు పథకం కింద ప్రతిపాదించిన కొత్త సామర్థ్యం గల నీటి ప్లాంట్ పూర్తయితే, రోజు విడిచి రోజు సరఫరా పరిస్థితి మారి ప్రతి రోజూ నీరు అందించే స్థితి ఏర్పడే అవకాశముంది.

Water Problem

నగరి మున్సిపాలిటీలో పాత నీటి పైపుల వ్యవస్థను దశలవారీగా బలోపేతం చేసి సరఫరాను సవ్యంగా కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం (Govt) ముందుకు సాగుతోంది. బలహీన వర్గాల కాలనీల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి 3.97 కోట్ల రూపాయలు, మొత్తం నీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి 13.96 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులు పూర్తయితే వార్డుల వారీగా చేపడుతున్న నీటి పంపిణీ మరింత క్రమబద్ధంగా మారి, ప్రజలకు సమయానికి నీరు అందే పరిస్థితి ఏర్పడనుంది.

పలమనేరు మున్సిపాలిటీలో భూగర్భ జలాల పై అధికంగా ఆధారపడటం వల్ల వేసవికాలంలో నీటి కొరత ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని తగ్గించేందుకు నీటి సరఫరా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక్కడ నీటి సరఫరా (Water supply) మెరుగుదలకు 5.39 కోట్ల రూపాయలు, బలహీన వర్గాల కాలనీల్లో తాగునీటి సదుపాయాల కోసం 10.42 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులు పూర్తయితే.. బోరు బావుల పై ఒత్తిడి తగ్గి, నీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా మారనుంది.

Water Problem

మొత్తంగా చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ రెండు పథకం కింద ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిధుల మంజూరు, ప్రతిపాదనల సిద్ధత, టెండర్ల (Tender) ప్రక్రియలు పూర్తయ్యే దశకు చేరుకోవడం వల్ల త్వరలోనే పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి రోజుకు 135 లీటర్ల తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ చర్యలు అమలులోకి వస్తే, చిత్తూరు జిల్లా పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

CLICK HERE TO READ ప్రజల పై భారం తగ్గించాలనే..

CLICK HERE TO READ MORE

Leave a Reply