వీడని శ్రీకృష్ణజన్మస్థానం
ఇప్పటికి 17 కేసులు పలకరింత
మూడు జిల్లాల పోలీసులు పడిగాపులు
తాజాగా పల్నాడుకు అప్పగింత
ఆ తరువాత అనంత.. అల్లూరి జిల్లాలు రెడీ
ఇంతకీ విముక్తి ఎప్పుడో.. హరి హరా వీరమల్లూ
కళాకారుడికి అభినందనలు ప్రాణం. ఈ ఊపిరి నిలిపినోళ్లే దేవుళ్లు. వాళ్లే అభిమానులు. అంతే కాదు సహకళకారుల కాళ్లకు మొక్కే గుణాన్నీనేర్పుతాయి. కానీ ఈ అభినందనలే అహంభావానికి పునాది వేస్తాయి. ఇంకేముందీ ఆత్మాభిమానం రగులుతుంది. అతివిశ్వాసం స్వైర విహారం చేస్తుంది. సభ్యతను చంపేస్తుంది. అసభ్య పదజాలమే కవిత్వంగా పరిఢవిల్లి..కడకు ఆ కళాకారుల్ని సభ్య సమాజానికి దూరం చేస్తుంది. అవును మేటి పదాలతో తన మాటల గారడీతో సినీ డైలాగ్ రచయితగా ఖ్యాతి సాధించిన పోసాని కృష్ణమురళి ప్రస్తుతం.. ఏపీ జైళ్లల్లో కుమిలిపోక తప్పటం లేదు. 17 కేసుల్లో చిక్కుకున్నారు. ఒక కోర్టు బెయిల్ ఇస్తే.. మరో కోర్టు అరెస్టు వారెంటు ఇచ్చే పరిస్థితి. ఇదీ సరే .. మేమే ముందు పీటీ వారెంట్ తెచ్చాం. మాకే అప్పగించండి, అని ఏపీలోని వివిధ జిల్లాల పోలీసులు జైళ్ల ముందు క్యూ కడుతున్న వైనం .. ప్రస్తుతం పోసాని కళ్లల్లో నీళ్లు గుక్క తిప్పుకోవటం లేదు. అయ్యో హాస్యశ్రీ.. లవ్ యూ రాజా అంటూ అభిమానులు మదన పడుతున్న తీరు ఇది.
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్
టాలీవుడ్ మాటల మాంత్రికుడు.. సహజ నటుడు.. దర్శకుడు.. సినీ నిర్మాత పోసాని కృష్ణ మురళీ పొలిటికల్ గేమ్‌లో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మితిమీరిన వాక్ స్వాతంత్య్రం నోటి దూల ఖ్యాతిని అంటగట్టింది. ఆయన సంధించిన వాక్భాణాలు రివర్స్ గేర్‌లో ఆయన్నే కృష్ణజన్మస్థానానికి దారిచూపగా.. ఇక జైలులో పోసాని మురళీగానం గతి తప్పింది. హిందోళరాగంలో అందరినీ ఆకట్టుకున్న మెంటల్ కృష్ణ ప్రస్తుతం రాజంపేట జైలులో తోడి రాగంలో కుమిలిపోతున్నాడు. ఈ సంగతి సరే.. ఏపీలోని నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం జిల్లా పోలీసులు .. పీటీ వారెంట్లతో రాజంపేట జైలు అధికారుల ఎదుట ప్రత్యక్షమై.. తమకే తొలుత లవ్ రాజాను అప్పగించాలని మొరాయించిన హాస్య సన్నివేశం కాస్త.. సీరియస్ సీన్‌గా మారింది. ఔను మీడియా రంగ స్థలంలో పోసాని కృష్ణ పండించిన నోటి దూల పంచాగం వికటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, ఇక జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలపై చెలరేగిన పోసాని కృష్ణ చివరకు ఆయా నాయకుల కుటుంబ సభ్యులను ఏకిపారేశారు.
అయ్యో .. ఇక శ్రీ కృష్ణజన్మస్థానమే..
మళ్లీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందనే ప్రగాఢ అతివిశ్వాసంతో వికటాట్టహాసం చేశారు. ఆ పార్టీని జనం తూర్పారబట్టటంతో.. అసలు నిజం గ్రహించి..రాజకీయ సన్యాసాన్ని ప్రకటించినా.. పోసానికి అసలు కష్టాలు తప్పలేదు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు తొలుత పోసానిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోసాని తన సహజ ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు. పోలీసులపై వ్యంగ్య భాణాలు సంధించారు. ఇంకేముందీ ఆయనకు పోలీసులు జైలు గోడల అనుభవాన్ని ప్రసాదించారు. కనీసం రెండు రోజులు జైలు నిద్రకు చాన్స్ ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ సినీ ఫక్కీలో అనారోగ్యం డ్రామాను తెరమీదకు తీసుకువస్తే వికటించింది. సోమవారం కోర్టులో బెయిల్‌పై విచారణ జరుగుతుంది, ఎట్టకేలకు బెయిల్ వస్తుందని ఆశపడిన పోసాని కలను ఏపీ పోలీసులు భగ్నం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు క్రైమ్ నెంబర్ 142/2024 ప్రకారం 153, 504, 67 సెక్షన్ల కింద పోసాని కృష్ణ మురళీపై కేసు నమోదు చేశారు. తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించి పీటీ వారెంటుతో రాజంపేట జైలుకు వచ్చారు. అంతలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు కూడా చేరుకున్నారు. తమ స్టేషన్లలోనూ పోసాని కేసులు నమోదు చేసిన విషయాన్ని వివరించారు. తొలుత తాము వచ్చామని, తమకే పోసాని కృష్ణను అప్పగించాలని నరసరావు పేట పోలీసులు అభ్యర్థించారు. ఇక చేసేది లేక.. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోసాని కృష్ణను నరసరావుపేట పోలీసులకు అప్పగించే సమయంలో.. మరో ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. మళ్లీ తనకు గుండె నొప్పి అంటూ పోసాని కృష్ణ గావుకేక పెట్టారు. ఈ సారి ఆయనను జైలు అధికారులు ఆసుపత్రికి తరలించలేదు. రాజంపేట ఆసుపత్రి డాక్టర్లే జైలుకు వచ్చారు. అంతా నార్మల్ అంటూ వెళ్లిపోగా.. ఇక పోసాని కృష్ణ పల్నాడు పోలీసులతో వెళ్లక తప్పలేదు.
అభిమానుల తిట్ల దండకం..
ఎందుకొచ్చిన రాజకీయాలు .. హాయిగా మాటలు రాసుకుని సినిమాలు తీస్తే సరిపోయేదని పోసాని అభిమానులు చిటపటలాడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి చిలకలూరి పేటలో పోటీ చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ధన స్వామ్యం తగదని .. నోట్లతో ఓట్లు కొనేది లేదని వాదిస్తే.. జనం ఓడించిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఆ రోజే రాజకీయాలు వద్దనుకుంటే బాగుండేదని, 150 సినిమాలకు మాటలు రాసి.. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ ను ఏలిన కృష్ణకు రాజకీయమే మెంటల్ తెప్పించిందని అభిమాన జనం వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ థియోటర్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా క్యాబినేట్ ర్యాంకు పదవి దక్కటంతో.. ప్రత్యర్థులను హీనాతి హీనంగా తిట్టగలిగిన మాటల మాంత్రికుడి పాత్ర పోషించి.. కడకు తన సినీ కెరీర్ ను ధ్వంసం చేసుకున్నారని పోసాని కృష్ణపై అభిమానులు తిట్లదండకం అందుకోవటం విశేషం.