నిజామాబాద్ ప్రతినిధి, మార్చి3 (ఆంధ్రప్రభ) : మహిళపై దాడి చేసిన బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుపై చర్యలు తీసుకోవాలని రెంజల్ మండలం జూపల్లి గ్రామానికి చెందిన భోగి భాగ్య ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫిబ్రవరి 13న లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో తన పర్సుపోవడంతో పోలీస్ అవుట్ పోస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అక్కడే ఉన్న సీఐ విజయ్ బాబు తన మాట వినిపించుకోకుండా లాఠీతో బాదాడని ఆరోపించారు. న్యాయం చేయాలని ఏడపల్లి పోలీస్ స్టేషన్ లో, బోధన్ ఏసీపీ, ఇన్చార్జి సీపీకి విన్నవించినా న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్ తో తన గోడును వెళ్లగక్కారు. సీఐపై కలెక్టర్ కి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.