Mylavaram | దేశంలోనే అగ్రస్థానంలో..

Mylavaram | దేశంలోనే అగ్రస్థానంలో..
Mylavaram | మైలవరం, ఆంధ్రప్రభ : కొత్త ఏడాది వేళ ముందస్తు పింఛన్లు పంపిణీ పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని, సంక్షేమ పాలనకు ఇది మరో నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరం మండలంలోని కీర్తి రాయునిగూడెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బుధవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. పింఛన్ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ముందస్తు పింఛన్ల పంపిణీతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. పేదల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడి ఉందన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్ నగదు నెలకు వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రమిది. ఒకటో తారీఖు నూతన ఆంగ్ల ఏడాది కారణంగా ఒక రోజు ముందుగానే అందిస్తున్నామన్నారు.
కూటమి సర్కారు హయంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకు పైగా పింఛన్ల పై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ నెలకు గాను రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశారన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో 303 కొత్త పెన్షన్లను కలుపుకొని 2,28,592 పెన్షన్లకు దాదాపు రూ.98.95 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
మైలవరం నియోజకవర్గంలో 42,107 మందికి రూ.18.16కోట్లు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీలను నిలబెట్టుకున్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అన్న ఎన్టీఆర్ గారి మాటలను సీఎం చంద్రబాబు ఆచరిస్తున్నారన్నారు. అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కింద ఆర్ధిక చేయూత, దీపం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, రైతులకు ఆర్థిక సాయం, తదితర పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. నవంబర్ మాసంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన యువకుడు బట్టు గోపీ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
