Accident | బైక్ ను ఢీకొన్న కారు… నలుగురు మృతి

వి.కోట, మార్చి 3, ఆంధ్రప్రభ : అంతర్ రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా కుప్పనల్లి సమీపంలో ఇటీవల మొదలైన ఎక్స్ ప్రెస్ గ్రీన్ వే లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న కదిరిగాని కుప్పకు చెందిన సీనప్ప కుమారుడు మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ నాన్నను బెంగుళూరు ఆసుపత్రిలో ఉండగా చూసుకొని తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్నారు. కేజీఎఫ్ – బంగారు పేట్ మధ్యన కుప్పనల్లి సమీపంలో ఎదురుగా ద్విచక్ర వాహనం లైట్లు లేకుండా రావడంతో ప్రమాదవశాత్తు కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.

ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న కదిరిగాని కుప్పంకు చెందిన సీనప్ప కుమారుడు మహేష్ (52), కమ్మసంద్రంకు చెందిన జయ రామప్ప భార్య రత్నమ్మ(60), సంతోష్ కుమార్తె ఉద్విత (2) తో పాటు ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడు ఘటనా స్థలంలో మృతిచెందారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న సంతోష్ భార్య సుస్మిత (30), ఆమె కుమారుడు విరాట్ (6), సుజాత (48) కారు డ్రైవర్ సునీల్(28)లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కోలార్ లోని జాలప్ప మెడికల్ ఆసుపత్రికి తరలించారు. 8నెలల గర్భిణీ అయిన సుస్మిత కడుపులోని పాపను కాపాడేందుకు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోగా పాప మృతిచెందింది. ఆమె మృత్యువుతో పోరాడుతోంది.

ఒకే కుటుంబానికి చెందిన బంధువులందరూ రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదఛాయలు అలముకున్నాయి. ఎక్స్ ప్రెస్ వే లో వాహనాల రాకపోకలకు అనుమతించిన బంగారు పేట – కేజిఎఫ్ మధ్య ఒకే వైపు అటు, ఇటు వచ్చే వాహనాలు వెళ్లి వస్తుండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బంగారుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply