Collector, SP | ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు
- ద్వారకా తిరుమలలోని ఉత్తర ద్వారదర్శన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
Collector, SP | ఏలూరు, ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనమునకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ క్షేత్రస్థాయిలో సోమవారం పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కే వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీకె.ప్రతాప్ శివ కిషోర్, ఆలయ పరిసరాలను, క్యూలైన్లను, బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ముఖ్య అంశాలు…

ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల నిర్వహణ ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ మాఢ వీధులు, ప్రవేశ ద్వారాల వద్ద భారీ బందో బస్తును ఎస్పీ సమీక్షించారు. రెవెన్యూ, పోలీస్, దేవాలయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు తాగునీరు, ప్రసాదం మరియు ఇతర కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రాకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రానికి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన పార్కింగ్ స్థలాలను, అదనపు సిబ్బందిని కేటాయించాలని సూచించారు.

ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి జయశర్మ, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, భీమడోలు ఇన్‌స్పెక్టర్ శ్రీ యు.జె.విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్, ఆలయ ఈఓ, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు అధికారులు సూచన చేస్తూ, ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం త్వరగా మరియు ప్రశాంతంగా కలిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భక్తులు కూడా క్రమ శిక్షణతో అధికారులకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని, భక్తుల సౌకర్యం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు మరియు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.


