judgment | ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

judgment | డీల్లీ, ఆంధ్రప్రభ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో సంచలనం రేపిన సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు, మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాధితురాలి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అప్పీల్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

2017లో ఉన్నావ్ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి బీజేపీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కుల్దీప్ సింగ్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో సెంగర్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. దీంతో సెంగర్ శిక్ష సస్పెన్షన్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఈ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి కుటుంబం, మహిళా హక్కుల సంఘాలు సెంగర్ శిక్ష సస్పెన్షన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు స్టే ఆదేశాలతో బాధితురాలి కుటుంబానికి కొంత ఊరట లభించింది.

Leave a Reply