స్వర్ణగిరి క్షేత్రంలో ధనుర్మాస శోభ..

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30న (మంగళవారం) జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.
ధనుర్మాస వేడుకల్లో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం సహస్రనామార్చన ఘనంగా జరిగాయి. లోక కళ్యాణార్థం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని స్వర్ణాభరణాలు, రంగురంగుల పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరినట్లుగా భావించే గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు.
మరోవైపు, భూదేవి అంశగా వెలసిన శ్రీ ఆండాళ్ అమ్మవారికి నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి చీర సారెలను తిరుమాడ వీధుల్లో ఊరేగించి సమర్పించారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు మరియు ప్రసాద వితరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
అధ్యయనోత్సవాలు – దివ్య ప్రబంధ పారాయణ..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశికి ముందు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
ఆదివారం జరిగిన వేడుకల్లో భాగంగా అధ్యయనోత్సవ మండపంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీవారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. అధ్యాపకులు, వేద పండితులు భక్తిశ్రద్ధలతో ఆళ్వార్ల పాశురాలను పారాయణం చేస్తూ భక్తులకు వినిపించారు. లోక ఆరోగ్యం, శాంతి , సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు ధన్వంతరి ఇష్ట యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నిత్య కళ్యాణం – తిరువీధి ఉత్సవం
శ్రీవారి వైభవోత్సవ మండపంలో స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం, అలంకృతుడైన స్వామివారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాల మధ్య సాగిన ఈ ఉత్సవం భక్తులను పరవశింపజేసింది.
ఉత్సవం ముగిసిన తర్వాత, సహస్ర దీపాల కాంతుల మధ్య ఊయలలో ఆసీనులైన స్వామివారు భక్తులకు ఊంజల్ సేవలో దర్శనమిచ్చారు. ఈ వేడుకలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

