District SP | పోలీస్ శాఖలో ఉత్సాహం

District SP | పోలీస్ శాఖలో ఉత్సాహం

District SP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజలతో సత్సంబంధాలు, నేర నియంత్రణలో కఠిన వైఖరి వంటి అంశాలతో ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పదోన్నతిని ప్రకటించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కొత్త పోస్టింగ్..

డీఐజీగా పదోన్నతి పొందిన విక్రాంత్ పాటిల్‌కు త్వరలోనే కొత్త పోస్టింగ్ లో భాగంగా విధులు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతంలో ఏదో ఒక చోట ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం.

ఐపీఎస్ గా సేవా ప్రస్థానం..

విక్రాంత్ పాటిల్ 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన రాష్ట్రంలో పలు జిల్లాల్లో కీలక బాధ్యతలు, లా అండ్ ఆర్డర్, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో కఠిన నిర్ణయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ట్రాఫిక్ కట్టడి, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల పై ప్రత్యేక దృష్టి, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఆనందం..

విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి లభించడం పై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. “న్యాయబద్ధమైన పాలన, స్పష్టమైన ఆదేశాలు, కఠినమైన న్యాయమైన నిర్ణయాలు” ఆయన ప్రత్యేకతగా పలువురు అధికారులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ పదోన్నతులు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పని తీరు ఆధారంగా అధికారులను ప్రోత్సహించడం వల్ల శాఖలో ఉత్సాహం పెరుగుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని అంటున్నారు. డీఐజీగా విక్రాంత్ పాటిల్ సేవలు రాష్ట్ర పోలీస్ శాఖకు మరింత బలాన్నిస్తాయని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply