Fake Case – రేప్ కేసూ బూట‌క‌మే .. ఎంక్వైరీలో సీన్ రివర్స్

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :
ఓ మహిళ తనను కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారని.. తనను కాపాడాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను అత్యంత దారుణంగా హింసించారని పోలీసుల ముందు వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ విషయాలు తెలిసి పోలీసులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఆమెను ఎందుకు అరెస్టు చేశారు?, పోలీసుల దర్యాప్తులో ఏం తెలిసింది?, ఆమెపై నిజంగానే అత్యాచారం జరిగిందా?, ఆమెను అరెస్టు చేయడం వెనుకున్న అసలు నిజాలు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎన్నో ఫిర్యాదులు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్‌షిప్‌ (సహజీవనం)లో ఉంది. ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య కొన్ని పరస్పర గొడవలు తలెత్తడంతో గతేడాది జూన్‌లో ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని తన భర్తగా ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అతడి వల్లే తన కడుపులో బిడ్డ చనిపోయిందని.. అతడు తనపై దారుణంగా దాడి చేయడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించింది.

ఫిర్యాదులో ఈవిధంగా చెప్పి కోర్టులో మాత్రం మాట మార్చేసింది. అది అయిపోయాక మరో నెల తర్వాత.. తన భర్త సమీప బంధువుపైనా ఫిర్యాదు చేసింది. తన వాంగ్మూలాన్ని మార్చుకోవాలని భయపెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు నమోదైంది. మరోవైపు తన భర్తపై ఈ ఏడాది మళ్లీ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను నట్టెటా ముంచేశాడని.. కులం పేరుతో దూషించి, దారుణంగా హింసించాడని ఆరోపించింది. ఈ కేసులో అతడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

అక్కడితో ఆగని ఆ మహిళ తన భర్త స్నేహితులపై మరో ఫిర్యాదు చేసింది. తాను ఇటీవల మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో తన భర్త స్నేహితులు కిడ్నాప్‌ చేసి మత్తుమందు ఇచ్చారని.. ఆ తర్వాత సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. అంతేకాకుండా బాడీపై కెమికల్స్ చల్లారని.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌ను చొప్పించారంటూ అత్యంత దారుణమైన ఆరోపణలు చేసింది.

ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంట వెంటనే సీసీటీవీలను పరిశీలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో నిందితుల కాల్‌ రికార్డులు, లొకేషన్లను చెక్ చేశారు. ఈ తరుణంలోనే పోలీసులు ఖంగుతినే వివరాలు దొరికాయి. గతంలో ఆమె పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఇలా ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పోలీసులు గుర్తించారు. చివరకు ఆమెను విచారించి అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *